Uttar Pradesh Lord Shiva Statue: శివుడు భోళాశంకరుడు. కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఇదే నమ్మకంతో ముక్కంటిని పూజిస్తూ ఉంటారు. ఐతే యూపీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. శంకరుడు తన మొర ఆలకించలేదంటూ ఓ యువకుడు ఏకంగా గుళ్లోని శివలింగాన్నే దొంగిలించాడు. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు.
నచ్చిన యువతితో పెళ్లి జరిగలేదని...
ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావాన్ మార్కెట్‌కు చెందిన 27 ఏళ్ల ఛోటూ అనే యువకుడు..ఓ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఐతే అందుకు అతని కుటుంబసభ్యులు నిరాకరించడంతో..ఎలాగైనా వారిని ఒప్పించాలనుకున్నాడు. శివభక్తుడైన ఛోటూ..శివయ్యకు మొరపెట్టుకున్నాడు. శ్రావణమాసం పూర్తయ్యేలోగా పెద్దల మనసు మార్చి తనకు నచ్చిన యువతితో పెళ్లి జరిగేలా చూడాలని..అత్యంత భక్తిశ్రద్ధలతో శివలింగానికి పూజలు చేశాడు. దాదాపు నెలరోజులు ఉపవాసం ఉండి శంకరుడికి అభిషేకాలు చేశాడు. రోజూ శివయ్యకు అభిషేకం చేస్తూ తన పెళ్లి జరిగేలా అనుగ్రహించమంటూ వేడుకున్నాడు. ఐతే ఉత్తరాదిలో శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమితో పూర్తై భాద్రపద మాసం వచ్చింది. తాను నెలరోజులుగా శివయ్యను పూజిస్తున్నప్పటికీ..శివయ్య తన కోరిక తీర్చలేదనే కోపంతో గుళ్లో శివలింగాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచేసి పరారయ్యాడు.
మర్నాడు ఆలయంలో శివలింగం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. శివలింగాన్ని దొంగిలించింది ఛోటూ అని తెలుసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించాడు. ఐతే శివలింగాన్ని దొంగిలించడానికి అతను చెప్పిన కారణం విన్న పోలీసులు షాకయ్యారు. ఆలయం వెలుపల శివలింగాన్ని దాచిన ప్రాంతాన్ని గుర్తించి తీసుకొచ్చి మళ్లీ గుళ్లో ప్రతిష్టించారు. నిందితుడిపై పోలీసులు సెక్షన్ 379, 411 కింద కేసు నమోదు చేశారు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.