America Woman Chained To Tree : మహారాష్ట్ర (Maharashtra) లోని సింధుదుర్గ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా (America) కు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె వానలో తడుస్తూ.. ఆకలితో అలమటిస్తూ నీరసించిపోయి అరుస్తుండడంతో ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం (Forest Area) లో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి.
దాంతో అతను చుట్టుపక్కల వెదికినప్పటికీ ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలో వెదకగా..ఓ చెట్టుకు ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను గుర్తించారు. ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్టు, తమిళనాడు ఆధార్ కార్డు, మరికొన్ని కాగితాలు కనిపించాయి. ఆమె భర్తే ఆమెను అక్కడి విడిచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని, మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (Goa Medical College Hospital) కి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితిని చూస్తే రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోనట్లు కనిపిస్తుంది. కానీ ఆమె 40 రోజుల నుంచి ఆహారం తీసుకులేదని కాగితం పై రాసి చూపినట్లు పోలీసులు తెలిపారు.