CM YS Jagan Biography: జగన్.. ఈ పేరే సంచలనం.. ఎవరికీ తలవంచని నైజం.. ఎందాకైనా ముందుకు సాగే ధీరత్వం.. ఏపీ రాజకీయాల్లో జగన్‌ను తిట్టే వాళ్లు ఉంటారు.. మెచ్చుకునే వాళ్లూ ఉంటారు. కానీ ఆయన ప్రస్థావన లేకుండా మాత్రం మాట్లాడరు.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (Y. S. Rajasekhara Reddy) కొడుకుగానే రాజకీయాల్లోకి దూసుకొచ్చినా తనకంటూ సపరేటు బ్రాండ్ క్రియేట్ చేసుకున్న జగన్ గురించి ఆసక్తికర విషయాలను ఇవాళ తెలుసుకుందాం!
అంగీకరించని సోనియా..
ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్దాం.. అది 2009 సెప్టెంబర్.. వైఎస్ మరణాంతరం రాష్ట్రమంతా విషాదచాయలు అలుముకోని ఉన్నాయి. ఓవైపు తండ్రి చనిపోయిన బాధలో జగన్ ఉన్నారు.. మరోవైపు అదే సమయంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు జగన్ సీఎం కావాలని ప్రతిపాదించారు. అయితే అప్పటికీ జగన్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చి నెలలు మాత్రమే గడుస్తున్నాయి. మరోవైపు ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్లు ఉన్నారు. దీంతో సోనియాగాంధీ ఎమ్మెల్యేల ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇది జగన్ రాజకీయ జీవితంలో అనేక మలుపులకు కారణమైంది.
మొండిగా ఓదార్పు యాత్ర..
సోనియా గాంధీ నిర్ణయాన్ని జగన్ వర్గం ఎమ్యెల్యేలు సపోర్ట్ చేయలేదు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి బాధిత కుటుంబాలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. అయితే, ఈ ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించకపోవడం.. జగన్ మొండిగా యాత్ర చేయడం.. సోనియా ఆగ్రహానికి గురికావడం.. వైఎస్సాఆర్‌సీపీగా కొత్త పార్టీని ఏర్పాటు చేయడం చకాచకా జరిగిపోయాయి.
Also Read: జగనన్న త్వరగా బ్యాండేజ్ తీసేయ్.. లేదంటే అంతే.. సునీత హెచ్చరిక..!
కష్టసమయంలోనూ..
2011లో జగన్‌పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ వరుస దాడుల వెనుక కాంగ్రెస్ హస్తముందన్న ప్రచారం జరిగింది. పలు కేసుల్లో చిక్కుకున్న జగన్ 16 నెలల జైలు జీవితాన్ని గడిపారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిల్ దక్కని పరిస్థితి ఉంది. అయితే జగన్ ఇలాంటి కష్టసమయంలోనూ వెనక్కి తగ్గలేదు. మొండిగానే పోరాడాడు. అనేక కేసులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల ఆయనకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్‌కు జగన్ మద్దతుదారుల రాజీనామాల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో జగన్ కడప ఎంపీగా ఎన్నికయ్యారు.
విజయానికి అతిపెద్ద కారణం..
2014 ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అధికారానికి దూరమైంది. జగన్ పార్టీకి ప్రజలు 67 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను కట్టబెట్టారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో 23మంది తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇది నిజానికి జగన్‌కు భారీ షాక్‌గానే చెప్పాలి. అయితే జగన్ మాత్రం ఈ పరిణామాలకు కుంగిపోలేదు. ప్రజల్లోకి వచ్చారు. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్ర జగన్ రాజకీయ జీవితంలో పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. దాదాపు 14 నెలల 13 జిల్లాల ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు జగన్. 3,648 కిలోమీటర్ల మేరకు సాగిన ఈ కాలినడక ప్రయాణం 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి అతిపెద్ద కారణంగా నిలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 151 ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో ఏకంగా 23 పార్లమెంట్ సీట్లను కొల్లగొట్టింది.
మరోసారి ఒంటరిగా...
అయితే, ఇప్పుడు రానున్న ఎన్నికలు జగన్ కు మరింత సవాల్ గా మారనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాడిన సంగతి తెలిసిందే. జగన్ మాత్రం ఈ ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో అండగా నిలిచిన సొంత చెల్లి షర్మిల సైతం ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా మారి అన్న జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని షర్మిల తోపాటు మరో చెల్లి సునీత కూడా అన్నపై దుమ్మెత్తిపోస్తున్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదని ప్రతిపక్ష్యాలు ధ్వజమెత్తుతున్నాయి. వైసీపీకి ఓటమి తప్పదని ఖరకండిగా చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ ఏమో గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, జగన్ మరోసారి అధికారంలోకి వస్తారా లేదా అనేది తెలియాలంటే జూన్ 4వ తేది వరకు వేచి చూడాల్సిందే..