Union Minister Kishan Reddy: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరగడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఇది బీజేపీ పనే అంటూ పొంగులేటి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల పని వారు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తున్నారని అన్నారు. ఐటీ సోదాలకు, తమకు సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు దాడి చేస్తారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అయినా.. సీబీఐ, ఈడీని స్థాపించింది కాంగ్రెస్ పార్టీనే కదా అని వ్యాఖ్యానించారు.
గురువారం నాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పలువురు అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుందన్నారు. మరో 12 సీట్లకు సంబంధించి గురువారం రాత్రి ఢిల్లీ నుంచి జాబితా రానుందని తెలిపారు. ఇప్పటికే చాలామంది నేతలు నామినేషన్ వేశారని, యువత సపోర్ట్ తమకే ఉందన్నారు. బీజేపీ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదానికి బీసీ సామాజిక వర్గాల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. గురువారం నాడు దాదాపు 70 నుంచి 80 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ తడి బట్టలతో గొంతు కోసే విధంగా తెలంగాణ ప్రజలకు శాపంగా మారారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాఫియాగా మారి ప్రజలను వణికిస్తున్నారని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఇంకా డబ్బులను నమ్ముకుని గెలుస్తామని భావిస్తున్నారని విమర్శించారు. ప్రజల మీద కేసీఆర్‌కు నమ్మకం లేదన్నారు. మాఫియా, డబ్బులు పంచడం, అధికార దుర్వినియోగం చేయడంపైనే నమ్మకం ఉందని వ్యా్ఖ్యానించారు. మాటల గారడీ చేసి బుట్టలో వేసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆదుకునే శక్తి, ఆర్థిక స్థితిని గాడిన పెట్టే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
కాంగ్రెస్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ దుర్మార్గమైన పార్టీ, చేతకాని పార్టీ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ అంధకారమే అవుతుందన్నారు. ఈ నెల 11వ తేదీన తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. మరో రెండు, మూడు సభల్లో పాల్గొంటారని చెప్పారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్డు షో కూడా ఉంటుందన్నారు. నేతలే ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఒక్కో రోజు నాలుగు లేదా ఐదు సెగ్మెంట్లు పర్యటించేలా చూస్తున్నామన్నారు. దీపావళి రోజు ప్రతి గడప గడపకు వెళతామని కిషన్ రెడ్డి తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయి వరకు గడప గడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరతామన్నారు కిషన్ రెడ్డి.
ఇటీవలి కాలంలో వస్తున్న ఎన్నికల సర్వేలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు సెల్ ఫోన్‌లో సర్వేలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. తప్పుడు సర్వేలు, దొంగ సర్వేలు వస్తున్నాయని, అసలు వాటి ఆఫీస్ ఎక్కడో కూడా ఎవరికీ తెలియదన్నారు. వాస్తవాలు చెప్పాలి తప్పితే పార్టీలకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వొద్దని అన్నారు కిషన్ రెడ్డి. ఎవరెన్ని చేసినా తప్పుడు రిపోర్టులు ఇచ్చినా.. వాటిని ప్రజలు నమ్మరన్నారు. దీపావళి తర్వాత ముమ్మరంగా ప్రచారం చేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారెంటీలు అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ బహిరంగ సభల్లో రెండు పార్టీల నేతలను దోషులుగా నిలబెడుతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కర్ణాటకలో గ్యారెంటీలు ఫెయిల్ అని అక్కడి మంత్రే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు ఉంటాయని చెప్పారు.
Also Read: