School girls tumble out from Van: స్కూల్ వ్యాన్ డ్రైవర్లు అంటే..ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలను తీసుకెళతారు కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డోర్లు సరిగ్గా వేశారో లేదో చూసుకోవాలి. చాలా నెమ్మదిగా వెళ్ళాలి. కానీ చాలా మంది ఇవేమీ పట్టించుకోరు. తమకు డబ్బులు వస్తే చాలు అన్నట్టు ఉంటారు. గుజరాత్‌లో వడోదరలో కూడా ఓ వ్యాన్ డ్రైవర్ ఇలానే ప్రవర్తించాడు. విద్యార్ధులు ఉన్న స్కూల్ వ్యాన్‌ను అత్యంత వేగంగా నడిపాడు. దీంతో వెనుక డోర్ ఓపెన్ అయి..ఇద్దరు పిల్లలు కింద పడిపోయారు. దాంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే విద్యార్ధులకు సపర్యలు చేయడంతో వారిద్దరూ త్వరగానే కోలుకున్నారు. రన్నింగ్ వ్యాన్‌లో నుంచి కిందపడినప్పటికీ పిల్లలకు పెద్దగా దెబ్బలు తగల్లేదు.
అయితే ఈ సంఘటనతో తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు. పెద్ద ప్రమాదం జరగలేదని అప్పటికి ఊపిరి పీల్చుకున్నా...మరొకసారి ఇలానే అయితే దిక్కేంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్కూలు యాజమాన్యంపైనా విరుచుకుపడుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.