కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలోని తన నివాసానికి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చేరుకున్నారు. తుమ్మల నివాసానికి భారీ సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆశావాహులు తుమ్మలను స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. అయితే వచ్చేఎన్నికల్లో తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మలకు పాలేరు అభ్యర్థిత్వం ఇవ్వకపోవటంతో... ఆ పార్టీకి రాజీనామా చేశారు తుమ్మల. తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.
బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామాలు
ఈ క్రమంలో తనతో పాటు నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న ఉమ్మడి ఖమ్మ జిల్లా ( Khammam)లోని ఆయన అనుచరగణాన్ని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామాలు చేయించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారి జిల్లాకు తుమ్మల వచ్చారు. అనుచరవర్గంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆయలనకు ఘనస్వాగతం పలికారు. ఇక తుమ్మల తొలుత హైదరాబాద్ నుంచి ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలోని తన నివాసానికి చేరుకొని పాలేరు నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
స్వాగత కార్యక్రమానికి రేణుకాచౌదరి దూరం
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రచార కమిటీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), సీఎల్పీనేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) లో కలిసి శ్రీసిటీ నుంచి వరంగల్ క్రాస్‌రోడ్, కాల్వొడ్డు మీదుగా ర్యాలీగా ఖమ్మం చేరుకుంటారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా కార్యాయంలో మీడియా సమావేశంలో తుమ్మల పాల్గొంటారు. ఈ సమావేశాలు, ర్యాలీ ద్వారా జిల్లా కేడర్‌లో ఎలాంటి వర్గాలు లేవని.. తామంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలు తమ పర్యటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు తామంతా కలిసొస్తున్నామన్న సందేశాన్ని ఇస్తున్నట్లు సమాచారం. అయితే తుమ్మల స్వాగత కార్యక్రమానికి దూరంగా రేణుకాచౌదరి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. తుమ్మల చేరిక ఇష్టం లేకనే రేణుకా చౌదరి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అన్నచర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.