TSRTC Grand Festival Challenge: బతుకమ్మ (Bathukamma), దసరా (Dussehra) పండుగలు వచ్చాయంటే చాలు. పట్టణాలు, నగరాలను వదిలి ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతుంటారు. ప్రయాణికులు రద్దీ వల్ల బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతాయి. అయితే ఈ పండుగల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సు ట్రిప్పులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే బస్సులు.. సగటను రోజుకు దాదాపు 32.21 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పటినుంచి ప్రతిరోజూ మరో లక్ష కిలోమీటర్లు అదనంగా నడపాలని ఆర్టీసీ భావించింది. బతుకుమ్మ, దసరాతో పాటు దీపావళి (Diwali), క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు.. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి జనవరి 22వ తేదీ వరకు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ విషయంపై ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) స్పందిస్తూ ఈ సవాలును స్వీకరించాలంటూ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు లేఖ రాశారు.
Also Read:జమ్మికుంటకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. షెడ్యూల్ వివరాలివే..
ఆర్టీసీ (TSRTC) సంస్థలో పదవీ విరమణలే తప్పు నియామకాలు లేకపోవడం వల్ల సరిపడా కండక్టర్లు, డ్రైవర్లు లేరు. సెలవుతో పాటు మరికొన్ని సెలవులను వాడుకోవడం వల్ల కూడా సిబ్బంది కొరతతో కొన్ని బస్సులు రద్దు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనివల్ల ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుంది. అందుకే ప్రస్తుతం రానున్న పండుగల సమయాల్లో ఆర్టీసీ వ్యూహం మార్చింది. బస్సులను అదనపు కిలోమీటర్లు నడపడంతో పాటు సెలవులు, సీ ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేసే సిబ్బందికి క్యాష్ రివార్డులు కూడా అందిస్తామని ప్రకటన చేసింది. దీనివల్ల ప్రతిరోజూ అదనంగా 1.64 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ.. 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌తో రూ.164కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఆర్టీసీ సంస్థ ప్రణాళికలు చేసింది.