TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తో పాటు.. ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్

New Update
TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తో పాటు.. ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా మిగతా రూట్లలోనూ ఈ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా జిల్లాల కేంద్రాలకు ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 1860 ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ ఆర్డర్ ఇచ్చింది. ఇందులో కొన్నింటిని డిసెంబర్ లో వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది సంస్థ. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రం పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ బుధవారం స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. తయారీదారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన ఈ బస్సుల నిర్మాణాన్ని పూర్తిచేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని సజ్జనర్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రిమెంట్ ప్రకారం.. జేబీఎం గ్రూప్ 500 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీకి అందించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డిసెంబర్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో ఈ బస్సులను అందుబాటులోకి తెస్తుందన్నారు సజ్జనార్.

ఈ బస్సుల్లో ప్రత్యేతల గురించి సజ్జనార్ వివరించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు భద్రతకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుందని, గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులుంటాయని తెలిపారు.

ఈ బస్సులను హైదరాబాద్ నుంచి భద్రాచలం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఆదిలాబాద్ తదితర రూట్లలో నడపాలని ఆర్టీసీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల స్పందన ఆధారంగా మరిన్ని రూట్లలో వీటిని పొడిగించనున్నారు.

Advertisment
తాజా కథనాలు