తెలంగాణలో రెండోసారి గ్రూప్-1 పరీక్ష (TSPSC Group-1 Exam) రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో తప్పనిసరిగా ఊరట లభిస్తుందని టీఎస్పీఎస్సీ భావించింది. కానీ.. డివిజన్ బెంచ్ సైతం పేపర్ రద్దును సమర్థిస్తూ తీర్పు రావడంతో కమిషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. డివిజన్ బెంచ్ తీర్పు వచ్చిన రోజు కమిషన్ పాలకవర్గం భేటీ జరిగింది. హైకోర్టు (Telangana High Court) తీర్పుతో ఇప్పుడు ఏం చేయాలన్న అంశంపై సుధీర్ఘంగా చర్చించింది పాలకవర్గం. కానీ ఆ సమావేశంలో కమిషన్ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. అయితే.. పేపర్ రద్దు విషయంలో టీఎస్పీఎస్సీ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మొదటిది.. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించడం. రెండవది.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు (Supreme Court) అప్పీలుకు వెళ్లడం. అయితే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో సారి పరీక్ష అంటే అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అయితే.. హైకోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!
నోటిఫికేషన్ నుంచి నేటి వరకు ఏమైదంటే?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి 503 పోస్టులతో 2022 ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఏళ్లుగా నోటిఫికేషన్ రాకపోవడం, భారీగా పోస్టులు ఉండడంతో దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయి. దీంతో మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను అదే ఏడాది అక్టోబరు 16న నిర్వహించింది టీఎస్పీఎస్సీ. ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ ఏడాది జూన్ 13న విడుదలయ్యాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తూ.. జాబితా కూడా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయిన వేళ.. పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు మార్చి 17న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 11న ప్రిలిమ్స్ ను మళ్లీ నిర్వహిస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!!
జూన్ 11న రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి సారితో పోల్చితే రెండో సారి నిర్వహించిన పరీక్షకు దాదాపు 50 వేల మంది అభ్యర్థులు దూరమయ్యారు. అనంతరం జూన్ 28న ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ కీని కూడా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అయితే.. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ నిబంధనను పాటించలేదని ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష రోజు 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రకటించిన కమిషన్.. ఆ తర్వాత ఆ సంఖ్య 2,33,506 అంటూ వెల్లడించిన విషయాన్ని కూడా వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. నిబంధనలన్నీ పాటిస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ వాదన ఇదే..!
రెండో సారి పేపర్ రద్దు తర్వాత అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, ప్రతి పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో టీఎస్పీఎస్సీ స్పందించింది. ఈ మేరకు బుధవారం వివరణ ఇచ్చింది. జూన్ 11న రెండో సారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి 258 పేపర్లు ఎక్కువగా రావడానికి కారణాన్ని తెలిపింది. పరీక్ష నిర్వహించిన రోజు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా 2,33,248 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు ప్రకటించామని తెలిపింది. అయితే.. ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేస్తున్న సమయంలో 2,33,506 మంది పరీక్ష రాసినట్లు తేలినట్లు వివరించింది టీఎస్పీఎస్సీ. ఈ నేపథ్యంలో స్కానింగ్ తర్వాత పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించి తుది సంఖ్యను ప్రకటించామన్నారు. లక్షల్లో అభ్యర్థులు పరీక్ష రాసిన సందర్భాల్లో లెక్కల్లో స్వల్ప తేడాలు రావడం సహజమేనని సమర్థించుకుంది టీఎస్పీఎస్సీ. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులు చేసే అధికారం కమిషన్ కు ఉంటుందని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు.