Rain Alert in Telangana: తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు సూచించింది.
ఇప్పటికే రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains)కురుస్తున్నాయి. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad) తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉదయం సమయంలో మాత్రం వాతావరణం పొగమంచు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. మరోసారి వర్ష సూచన ఉండటంతో రైతులకు ఊరట లభించినట్లే అని సంతోషపడుతున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాడు గణపతి నిమజ్జనాలు జరుగుతున్న సమయంలో కూడా వర్షం పడింది.ఇప్పుడు మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒకటి, నైరుతి బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. గురువారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అత్యధికంగా 11.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 6.1, సిద్దిపేట జిల్లా మద్దూరు 5.5, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ 5.4, నిర్మల్ జిల్లా కుబేర్ 5.1, హైదరాబాద్ జిల్లా మారేడుపల్లి 4.5, నిజామాబాద్ జిల్లా బాల్కొండ 4.3, జగిత్యాల జిల్లా భీమారం 4, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ 3.9, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 3.7, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 3.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో 3 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెం శివారు అంబబాబిగూడెంకు చెందిన చింతల పెంటారెడ్డి(50), నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటికు చెందిన సోర్‌మార్ మహేందర్(32) గురువారం వారి పొలాల్లో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందారు.
Also Read: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!!