భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాయనపేటలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వివాహిత మృతి చెందింది. గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయనపేట ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో మహిళ మృతదేహంతో వస్తున్న వాహనం కోతకు గురైన రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లకపోవడంతో మృతురాలి బంధువులే.. డెడ్ బాడీని మోస్తూ వాగు దాటాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గ్రామస్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మృతదేహాన్ని గ్రామానికి చేర్చారు.
This browser does not support the video element.
మరోవైపు రోడ్డు కోతకు గురై నెలలు దాటుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు వచ్చి వెళ్తున్నారే తప్ప రహదారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాలన్నా.. వాగు దాటాల్సిందనని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడమే కాకుండా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగ కాంతారావ్ సొంత మండలం కరకగూడెంలో ఇలాంటి దుస్థితి ఉండటం గమనార్హం.
This browser does not support the video element.
రాజకీయ నాయకులకు తాము ఎన్నికల సమయంలోనే గుర్తొస్తామని రాయనపేట గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమపై ఎనలేని ప్రేమ చూపిస్తారని, రోజుకు 10 సార్లు తమ ఇంటికి వచ్చిపోతుంటారని, పిల్లలకు చాక్లేట్లు కొనిస్తారని తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామంవైపు చూడరని, తమ సమస్యలపై వారిని కలవడానికి వెళ్తే పట్టించుకోక పోగా.. తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం చిరుమల వాగుపై బ్రిడ్జిని నిర్మిస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని లేకుండా ఓటు వేసేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు.