Revanth Reddy about Medigadda Project: రాహుల్ గాంధీతో (Rahul Gandhi) కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో పాటు కాళేశ్వరం కరెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని నిప్పులు చెరిగారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందన్నారు. పిల్లర్లు రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మెడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తేనే ఏంటనేది తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన L&T కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Vijayashanthi: రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదు..ఏదో ఒక్క దానికే…!
సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందన్నారు. గుడిని గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్ ను తెలంగాణ సమాజం శిక్షించాలని కోరారు. 'కేసీఆర్ పాపం పండింది... కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగింది' అంటూ సంచలన వాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరయిందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ (BRS) అవినీతిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ అవినీతికి ప్రాజెక్టు బలైందంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే.. కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుందని దుమ్మెత్తి పోశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆరెస్ కు స్పష్టత వచ్చిందన్నారు. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ను ఓడించి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్ ను గెలిపించాలనుకున్నా.. అది జరగదన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది... కేసీఆర్ ను పడగొడుతుందని అన్నారు రేవంత్ రెడ్డి.