Tourists Stuck In Raigad Fort Due To Heavy Rain : మహారాష్ట్ర (Maharashtra) ను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం భారీ వర్షం పడుతుంది. ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలుప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్ (Raigad Fort) ను సైతం వరదనీరు చుట్టుముట్టింది. ఆదివారం సెలవు కావడంతో ఫోర్ట్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వాతావరణం చల్లబడటంతో ఫోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఫోర్ట్ సందర్శనకు వచ్చారు.. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్యలో అక్కడ భారీ వర్షం కురిసింది. ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.
వారంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి. సాయం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొండలపై నుంచి ఉద్ధృతంగా కిందకు జారుతున్న జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం మధ్య పర్యాటకులు (Tourists) రెయిలింగ్‌లు, మెట్లను పట్టకుని వేలాడుతూ కనిపించారు.