Toilet Remark Row: జాతులను, కులాలను, మతాలను, రంగును, రాష్ట్రాలను, ప్రాంతాలను జనరలైజ్ చేసి నోరుపారేసుకునే మనుషులు ఈ భూగోళమంతా ఉన్నారు. ఇండియా అందుకు మినాహాయింపేమీ కాదు. భారత్‌లో ఈ తరహా వివక్ష, మైండ్‌సెట్ కాస్త ఎక్కువే. రెసిజం దగ్గర నుంచి కుల వివక్ష వరకు ప్రతీది నాటుకుపోయి ఉన్న మనుషులు దేశంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. దక్షిణ భారతమైనా, ఉత్తర భారతమైనా ఈ అహంకారం ఉంటుంది. లేదు లేదు మా దగ్గర ఉండదంటే అది అబద్ధమే అవుతుంది. లేకపోతే నిజాన్ని ఒప్పుకునే, ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యమైనా లేకుండా ఉండి ఉండాలి. INDIA(బీజేపీ యాంటీ పార్టీలు) బ్లాక్ కూటమిలో కీలక పాత్ర పోషించే దక్షిణాది పార్టీ డీఎంకే, ఉత్తరాది పార్టీ జేడీయూ మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. అందరూ హిందీ నేర్చుకోవాల్సిందేనని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ (Nitish Kumar) తమిళ పార్టీపై చికాకు పడడం.. ఆ తర్వాత డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌కు (Dayanidhi Maran) సంబంధించిన ఓ ఓల్డ్‌క్లిప్‌ని బీజేపీ (BJP) పనిగట్టుకోని సోషల్‌మీడియాలో వైరల్ చేయడం అగ్గి రాజేసింది. ఓ వీడియోలో దయానిధి మారన్ యూపీ, బీహార్ కూలీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారంతా కూలీ పనుల కోసం వచ్చి బాత్‌రూమ్‌లు కడగడంతో తమ పనిని ముగిస్తారంటూ చులకనగా మాట్లాడారు. దీనిపై జేడీయూ స్పందించదా అని బీజేపీ ప్రశ్నించగా.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దయానిధి మారన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగలేదు. తాజాగా మరో వీడియో సోషల్‌మీడియాలో రచ్చ చేస్తోంది.
ముదురుతోన్న యుద్ధం:
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన వ్యాఖ్యలను డీఎంకే తాజాగా షేర్ చేసింది. ఆ వీడియోలో తరుణ్ విజయ్ దక్షిణాది ప్రజలను నల్లజాతీయులు అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. 'మేము జాత్యహంకారంతో ఉంటే, దక్షిణాది మొత్తం ఎందుకు ఉంటుంది? తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఆంధ్రా.. వారితో ఎందుకు జీవిస్తాము? మా చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు' అని రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్ చేసిన కామెంట్స్‌ను డీఎంకే ఐటీ సెల్ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. 2017లో అల్ జజీరా టీవీలో జరిగిన చర్చలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారాన్ని రేపారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. అయితే 2019లో మారన్ వీడియోను బీజేపీ షేర్ చేసినట్టే 2017లో విజయ్ చేసిన రెసిస్ట్ కామెంట్స్‌ను డీఎంకే కౌంటర్‌గా షేర్ చేసింది. ఇలా కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు ఇచ్చుకునేందుకు బీజేపీ, డీఎంకే షేర్లు చేసుకుంటుంటే..ఇది కాస్త సోషల్‌మీడియాలో రచ్చకు దారి తీసింది. రెండు పార్టీల గొడవను కొంతమంది సౌత్ వర్సెస్ నార్త్ ఇష్యూగా చూస్తుండడం విడ్డూరం.
2019లో జరిగిన ఒక కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడిన వ్యాఖ్యల దుమారాన్ని రేపాయి. తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్‌ల నుంచి హిందీ మాట్లాడేవారు నిర్మాణ పనులు లేదా రోడ్లు, మరుగుదొడ్లను శుభ్రపరుస్తారని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ క్లిప్‌ను షెహజాద్ పూనావల్లాతో సహా పలువురు బీజేపీ నాయకులు షేర్ చేశారు. మరో క్లిప్‌లో మారన్ ఇంగ్లీష్ నేర్చుకున్న వారిని, హిందీ మాత్రమే నేర్చుకునే వారిని పోల్చారు. ఇంగ్లిష్ నేర్చుకున్న వారు ఐటీ కంపెనీలలో చేరుతున్నారని.. హిందీ వచ్చిన వారు చిన్న ఉద్యోగాలు చేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు క్లిప్స్‌కు కౌంటర్‌గా అన్నట్టు డీఎంకే విజయ్ పాత వీడియోను షేర్ చేసింది.
Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?
WATCH: