తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి తరలి వస్తుండటంతో స్వామి ఆదాయం కూడా భారీ స్థాయిలో వస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఇంకా అధికంగా స్వామి వారి కానుకలు పెరిగాయి.
సోమవారం ఒక్కరోజే స్వామి వారిని సుమారు 74,617 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో సోమవారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.5.67 కోట్లు వచ్చింది. 32,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ తెలిపింది.
మంగళవారం కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మంగళవారం నాడు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. గత నెల లాగానే ఈ నెల కూడా స్వామి వారి హుండీకి సోమవారం సెంటిమెంట్ కలిసి వచ్చింది.
జులైలో వరుసగా నాలుగు సోమవారాలు భారీగా ఆదాయం సమకూరింది. గత నెలలో 10, 17, 24, 31 తేదీల్లో (ఈ నాలుగు సోమవారాల్లో) హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. జులై 10న రూ.5.11 కోట్ల ఆదాయం రాగా.. జులై 17న రూ.5.40 కోట్ల ఆదాయం సమకూరింది. జులై 24న చూస్తే హుండీ ఆదాయం రూ.5 కోట్లు వచ్చింది. ఇక 31న హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు సమకూరింది. జులైలో ఇలా వరుసగా నాలుగు సోమవారాలు ఆదాయం రూ.5 కోట్లు వరకు రావడం ఆసక్తికరంగా మారింది.
మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఒకటి, రెండు రోజులు మినహా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు శ్రీవారి హుండీకి గతేడాది మార్చి నుంచి రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. గతేడాది మార్చిం నుంచి ఈ ఏడాది జులై వరకు చూస్తే.. ప్రతి నెలా రూ.100 కోట్ల మార్కును అందుకుంటోంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది.