భారత్ లో టాలెంట్ ఉన్న యువతకు ముందు నుంచి ఎలాంటి లోటు లేదు. కానీ పరిస్థితుల ప్రభావంతో చాలా మంది యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే విజయం సొంతమవుతుందని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఆటో డ్రైవర్ కొడుకు. సివిల్స్ టార్గెట్ గా పెట్టుకున్న ఆ యువకుడు ఇప్పుడు భారతదేశంలోనే అతి చిన్న వయస్సులోనే ఐఏఎస్ గా ఎంపిక అయ్యి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఆటో డ్రైవర్ కొడుకు సివిల్స్ ఎలా కొట్టగలిగాడు? ఎలా ప్రిపేర్ అయ్యాడు? విజయం కోసం ఎలాంటి ప్రణాళికలు వేశాడు? ఇంత చిన్న వయస్సులోనే ఎలా విజయాన్ని అందుకున్నాడు? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
కృషి, అంకితభావం:
UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఎటువంటి ఖరీదైన కోచింగ్ లేదా తరగతులు అవసరం లేదు. కేవలం కృషి, అంకితభావం మాత్రమే సరిపోతుంది. ప్రతి సంవత్సరం ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. అయితే 800-1000 మంది ఎంపిక అవుతారు. ఈ పరీక్షలో కొంతమంది అభ్యర్థులు రెండు లేదా మూడు ప్రయత్నాల తర్వాత ఉత్తీర్ణత సాధించగలరు. ఇంకొంతమంది మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైనవారూ ఉన్నారు. ధనిక కుటుంబాలకు చెందిన వారే కాదు UPSCలో ఉత్తీర్ణులవ్వడమే కాకుండా, అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన కొందరు అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరై సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మహారాష్ట్రలోని జల్నా గ్రామానికి చెందిన అన్సార్ షేక్ అందులో ఒకరు.
ఐఏఎస్ అన్సార్ షేక్ సమాజానికి స్ఫూర్తిగా నిలిచాడు:
మహారాష్ట్రలోని జాల్నా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అన్సార్ షేక్ కేవలం 21 ఏళ్ల వయసులోనే తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌గా మారి చరిత్ర సృష్టించాడు. అన్సార్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా 91 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో 73 శాతం మార్కులతో పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అన్సార్ UPSC కోసం ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నాడు. మూడు సంవత్సరాల కష్టపడి మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో 361 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించాడు.
తండ్రి ఆటో డ్రైవర్ :అన్సార్ షేక్ తండ్రి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, మరఠ్వాడాలో ఆటో రిక్షా నడుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అన్సార్ ఇద్దరు సోదరీమణులకు చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి. తమ్ముడు కూడా చదువు మానేసి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో పెట్టాలని బంధువులు అన్సార్ తండ్రికి సూచించారు.
బంధువుల మాటలు విన్న తండ్రి అన్సార్ పాఠశాల మానిపించేందుకు ఉపాధ్యాయులకు చెప్పేందుకు వెళ్లాడు. అన్సార్ చదువులో తెలివైనవాడని...కొన్ని రోజులు కష్టపడి చదివిస్తే ఉన్నత స్థానానికి వెళ్తాడని ఉపాధ్యాయులు అతని తండ్రికి వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, అన్సార్ స్నేహితులు కూడా అతనికి డబ్బుతో చాలా సహాయం చేశారని, ఇప్పుడు ఐఏఎస్ అయ్యి, తన స్నేహితుల సహాయానికి అన్సార్ రుణం తీర్చుకున్నాడు.
తన తండ్రిని చూసిన ప్రతిసారి అన్సార్...నేను మాత్రం నా తండ్రిలా మారకూడదనే పట్టుదల,విశ్వాసం ఆయనలో పెరిగింది. చుట్టుపక్కల వాతావరణం నుంచి అతనిలో పెరిగిన పట్టుదల్లో అన్సార్ ను సివిల్స్ కొట్టెలా చేసింది. కష్టాలు, సమస్యల గురించి ఆలోచించకుండా లక్ష్యంపై గురిపెడితే..ఎవరైనా విజయం సాధిస్తారని చెబుతున్నారు అన్సార్.