Health benefits of ginger and turmeric : చాలా మందికి ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం అలవాటు ఉంటుంది. మరికొందరు తమ రోజును గ్రీన్ టీ, టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. మనం ఉదయాన్నే తాగే డ్రింక్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ మార్నింగ్ డ్రింక్ ఎంచుకునేటప్పుడు ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం ఉదయాన్నే అల్లం, పసుపు టీ తాగడం మంచిది. పచ్చి పసుపు, అల్లం రెండూ సహజంగా యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి అనేక అనారోగ్యాలు, సాధారణ ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ హెల్తీ డ్రింక్ ను ఉదయాన్నే తాగడం వల్ల 5 ప్రయోజనాలను పొందవచ్చు.
1.శరీరంలో మంట తగ్గుతుంది:
అల్లం, పసుపు రెండూ శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనాలు, పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల వల్ల కలిగే సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
2. జీర్ణక్రియకు సహాయపడుతుంది:
అల్లం జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపించడం, వికారం తగ్గించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. పసుపు జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెండింటిని ఉదయం తీసుకున్నట్లయితే జీర్ణఆరోగ్యానికి తోడ్పడతాయి.
3. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:
పసుపు, అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతాయి. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. అల్లం పసుపు పానీయంతో మీ రోజును ప్రారంభించడం వలన బలమైన రోగనిరోధకశక్తిని ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తాయి.
4. మెరుగైన రక్త ప్రసరణ:
అల్లం, పసుపు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. అల్లం రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది, అయితే పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. బరువు అదుపులో ఉంటుంది:
పసుపు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. పసుపులోని కర్కుమిన్ జీవక్రియను పెంచడం, వాపును తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అల్లం ఆకలిని అదుపులో ఉంచుతుంది. మీ మార్నింగ్ డ్రింక్‌లో ఈ మసాలా దినుసులు తీసుకోవడం వల్ల మీ బరువు నిర్వహణ సులభం అవుతుంది.
అల్లం పసుపు పానీయం రెసిపీ:
కావలసిన పదార్థాలు:
-1 కప్పు వెచ్చని నీరు
-1/2 tsp తురిమిన తాజా అల్లం లేదా అల్లం పొడి
-1/2 tsp పసుపు
-ఒక చిటికెడు నల్ల మిరియాలు
-తేనె లేదా నిమ్మకాయ.
తయారీ విధానం:
గోరువెచ్చని నీటిలో తురిమిన అల్లం, పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇందలో 1 టేబుల్ స్పూన్ తేనెను జోడించవచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.