హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. కొంతకాలంగా ఈ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భూములు కొనేవారి సంఖ్యకూడా గణనీయంగానే పెరుగుతోంది. ఇక అక్టోబర్ నెలలో జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. అందులో హైదరాబాద్ లో ఒక్క నెలలోనే 5వేల 787 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించింది. ఇక గతేడాది ఇదే సమయంతో పోలిచినట్లయితే ఏకంగా 25శాతం పెరిగినట్లు రిపోర్టులో వివరించింది.
అక్టోబర్ లో పెరిగిన రిజిస్ట్రేషన్లు:
అక్టోబర్ 2023లో రూ. 3వేల 170కోట్ల విలువ చేసే 5వేల 787 రెసిడెన్షియల్ ప్రాపర్టీ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రంక్ నివేదిక తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం...ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతకంతకూ పెరుగుతోందని తెలిపింది. ఈసారి 25శాతం పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్,మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి.
మొత్తం ప్రాపర్టీల విలువ రూ. 3వేల 170కోట్లుగా ఉంది. ఇది కూడా గతేడాదితో పోల్చితే 41 శాతం పెరిగింది. దీనికి ప్రధానకారణం ఎక్కువ విలువ ఉన్న ఇళ్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి,రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలోకి వస్తాయి. ఎక్కువగా అక్టోబర్ నెలలో చూస్తే మొత్తం ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో రూ. 25 నుంచి 50లక్షల మధ్య ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా జరిగినట్లు తెలిపింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో దీని వాటానే 50శాతంగా ఉంది. రూ. 25లక్షల లోపు విలువ ఉన్న ప్రాపర్టీల వాటా 16శాతంగా ఉంది. ఇది 2022 అక్టోబర్ లో 22శాతం ఉంటే..రూ. కోటికిపైగా విలువ ఉన్న ప్రాపర్టీల అమ్మకాలు మొత్తం రిజిస్ట్రేషన్లో 10శాతంగానే ఉన్నాయి.
హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉందని తెలిపారు నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిషిర్ బైజాల్. ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచడం, పెంచకుండా ఉపశమనం కల్పించడం కారణంగా ఇళ్ల కొనుగోలు దారులు ఇప్పుడు పండగ వేళ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువగా వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల మేరు విస్తీర్ణం ఉన్న స్థలాలనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి వాటా 69శాతంగా ఉంది.