Crime: న్యూయార్క్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటుపడిన టైరీస్ హాస్పిల్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్, టెక్ కంపెనీ సీఈవో ఫహిమ్ సలేహ్ ను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు.
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫహిమ్ సలేహ్ (33) న్యూయార్క్‌లోని ఓ టెక్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. టైరీస్ హాస్పిల్ (25) అనే వ్యక్తి అతడి దగ్గర పీఏగా పని చేస్తున్నాడు. అయితే టైరీస్.. మెరైన్ చావెజ్ అనే యువతితో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సంతోషపెట్టాలనే తప్పనతో చోరీలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి వేల డాలర్లు కొట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బు మాయం కావడానికి హాస్పిల్ కారణమని గుర్తించిన సీఈవో అతడిని నిలదీశాడు. ఈ విషయం పెద్దది చేయవద్దని తన బాస్‌ను వేడుకున్నాడు. అతడిపై కాస్త జాలి చూపిన సలేహ్ వాయిదాల వారీగా డబ్బు తిరిగి చెల్లించాలని అవకాశం ఇచ్చాడు. మరో మార్గంలో మరికొంత డబ్బును చోరీ చేసే ప్రయత్నంలో సీఈవోకు దొరికిపోయాడు. ఈ విషయం తన గర్ల్‌ఫ్రెండ్‌కు తెలిస్తే.. తనని ఎక్కడ వదిలేస్తుందోనని భయపడ్డాడు. దీంతో సీఈవోను చంపేందుకు పథకం రచించించాడు. ముసుగు ధరించి తన బాస్ అపార్ట్మెంట్లోకి రహస్యంగా చొరబడ్డ హాస్పిల్.. అతడిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. తన నేరం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలితో ఉన్న హాస్పిల్‌ను పోలీసులు పట్టుకున్నారు.