Nagoba Jatara : ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర(Nagoba Jatara) ప్రారంభమైంది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు. మేస్రం వంశీయులు ఆలయ గర్బగుడిలో నవధాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా.. నవదాన్యాలు, పాలకలశం పై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగ శేషుడి ఆశీర్వాదం దొరికిందని ప్రధాన పూజను నాగోబా ఆలయ మేస్రం పూజరులు ఆరంభిస్తారు. రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
గోదావరి జలాలతో అభిషేకం..
పుష్యమాస అమవాస్య నాడు అర్ధరాత్రి నాగోబా దేవాలయంలో సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్దలతో మేస్రం వంశ పూజారులు పూజలు నిర్వహిస్తారు. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనే, బెల్లం, గానుగ నూనేతో పాటు 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాద్య దైవం నాగోబాకు అభిషేకం చేస్తారు. కాగా, నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లరా చూసి తన్మయత్వం చెందుతారు. ఈ ప్రత్యేక పూజలకు ఖానాపూర్(Khanapur) ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిపాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌసం ఆలంలు హాజరు అయ్యారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay: నేనేం చేస్తానో చూపిస్తా.. ప్రజాహిత పాదయాత్ర షురూ
ఆదివాసీలకు కీలకమైన పండుగ..
అయితే, జాతర ప్రారంభానికి ఒక రాగి చెంబులో కొన్ని పాలను పోసి.. నవధాన్యాలు, మొలకలు అన్నిటికీ ఒక కొత్త రుమాలును కప్పి గర్బగుడిలోని పుట్టపైన పెడతారు. అయితే, ఆ పుట్టమీద ఉన్న రుమాలు కదిలితేనే.. జాతరకు నాగదేవత అనుమతి ఇచ్చారని అక్కడి వారి నమ్మకం. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం.
పూజలకే కాదు అన్నీ ప్రత్యేకమే..
నాగోబా జాతరలో పూజ విధానాలే కాదు ఆచార వ్యవహారాలు నడవడిక.. నియమ నిష్ఠలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. తమ పూర్వీకుల్ని స్మరిస్తూ నిర్వహించే పెర్సపాన్ పూజ, కొత్త కోడళ్లను పరిచయం చేసే బేటింగ్ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఆదీవాసీల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆటా పాటాలతో నాగోబా జాతర కన్నుల పండగగా కనిపిస్తుంది. నాగోబా జాతర ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో సహా ఒడిషా, చత్తీస్‌ఘడ్, మహారాష్ర్టల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ నెల 12వ తేదీన నాగోబా దర్బార్ హాల్ లో అధికారుల సమక్షంలో గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. సంప్రదాయం ప్రకారం అధికారులు, మంత్రులు గిరిజన దర్బార్‌కు హాజరకానున్నారు. ఈ వేదికగా ఆదివాసీల సమస్యలు-పరిష్కారంపై ప్రధానంగా చర్చిస్తారు.