ఎలాన్ మస్క్(Elon Musk)...ట్విట్టర్(Twitter) ను తన చేతిలోకి తీసుకున్న తరువాత ట్విటర్లో ఎన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయో..ట్విటర్ కార్యాలయం లో కూడా అన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మస్క్ కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు.
ఆయన తన పిల్లలతో ఎప్పుడూ సరదాగా గడుపుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలతో ఉన్న చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా ఆయన పిల్లల గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల ప్రాధాన్యత గురించి చాటి చెప్పారు. ఎవరైతే పిల్లల్ని కలిగి ఉంటారో..వారంతా కూడా ప్రపంచాన్ని కాపాడినట్లే అని వివరించారు.
గత వారం బుడాపెస్ట్ లో ద్వైవార్షిక జనాభా సదస్సు నిర్వహించారు. అయితే అందులో తగ్గిపోతున్న జనాభా గురించి ప్రపంచ వేత్తలు ప్రసంగించారు. దానికి మస్క్ కూడా హాజరు కావాల్సి ఉండగా ఆయన కొన్ని కారణాలతో వెళ్లలేకపోయారు. మంగళవారం టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీకి హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ వచ్చారు.
ఆమె తన కంపెనీకి రావడంతో ఆమెతో కలిసి ఆయన ఫ్యాక్టరీ అంతా కలియతిరిగారు. ఆ సమయంలో మస్క్ వెంట ఆయన కుమారుడు ఎక్స్ యాష్ ఏ 12 కూడా పక్కనే ఉన్నాడు. మస్క్ ఫ్యాక్టరీలో పర్యటిస్తున్నప్పుడు తన కొడుకుని తన భుజాల మీద కూర్చొబెట్టుకుని నడిచారు.
కటాలిన్ నోవక్ తో మస్క్ జనాభా సంక్షోభం గురించి కొద్ది సేపు మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన తరువాత '' పిల్లల్ని కలిగి ఉండటం అంటే ప్రపంచాన్ని రక్షించినట్లే అని'' ఆయన ట్వీట్ చేశారు. హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవక్ ఫేస్ బుక్ లో మస్క్ ట్వీట్ కి స్పందనగా రిప్లయ్ ఇచ్చారు.
పిల్లల్ని కలిగి ఉండాలి అనే భావన రానున్న తరాల వారిలో ఉండాలని, ఈ విషయాల గురించి మస్క్ తో చర్చలు జరిపినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది పిల్లల్ని వద్దు అనుకుంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అన్నారు.ప్రపంచం పిల్లల్ని రక్షిస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు అని అర్థం వచ్చేలా మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.