Mushaal Hussein Mullick : పాకిస్థాన్ ఇప్పుడు బహిరంగంగానే ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోంది. ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ మాలిక్‌కు పాకిస్థాన్ (Pakisthan )అపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి హోదా ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా, పాకిస్థాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ తన ప్రభుత్వంలో ముషాల్ ( Mushaal)కు చోటు కల్పించారు. పాకిస్థాన్ తాత్కాలిక క్యాబినెట్‌లోని 18 మంది సభ్యులతో పాటు ముషాల్ మాలిక్ ప్రమాణ స్వీకారం చేసినట్లు పాకిస్థాన్ ఆజ్ న్యూస్ నివేదించింది. నివేదికల ప్రకారం, ముషాల్ పూర్తి స్థాయి మంత్రిగా బాధ్యతలు స్వీకరించరు. కానీ PM కాకర్‌కు మానవ హక్కుల సమస్యలపై ప్రత్యేక సలహాదారుగా పని చేస్తారు. ఎందుకంటే అక్కడ పాకిస్థానీయుడు మాత్రమే పూర్తికాల మంత్రి కాగలడు. కానీ ద్వంద్వ పౌరసత్వం ఉన్న వ్యక్తి కూడా సలహాదారు పదవికి అర్హులే. అయినప్పటికీ మంత్రికి ఉన్న అధికారాలు ముషాల్‌కు ఉంటాయి.
ఆజ్ న్యూస్ ప్రకారం, ముషాల్ 2009లో రావల్పిండిలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ (Yasin Malik,)ను వివాహం చేసుకుంది. 2005లో యాసిన్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. ముషాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పట్టభద్రురాలు. ఆమె తన కుమార్తెతో కలిసి ఇస్లామాబాద్‌లో నివసిస్తోంది. ముషాల్ తండ్రి ఆర్థికవేత్త. తల్లి పాకిస్థాన్ ముస్లిం లీగ్ (Pakistan Muslim League)నాయకురాలు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఉగ్రవాది యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలు (Tihar Jail)లో ఉన్నాడు . గతేడాది ఎన్‌ఐఏ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే యాసిన్‌ను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడంపై ఇటీవల రచ్చ జరిగింది. యాసిన్‌ను విడుదల చేయాలని ముషాల్ ఎప్పటికప్పుడు పాకిస్థాన్, అంతర్జాతీయ సంస్థల నేతలకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది.