Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ గుట్టు రచ్చకెక్కింది. ఆయన భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, కుమార్తెలు తన భర్త, తమ తండ్రి తమకు కావాలంటూ దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
దువ్వాడ వ్యక్తిత్వం లేని వైఖరి వల్ల కేవలం కుటుంబం మాత్రమే కాకుండా..ఆయన వెంట ఉన్న కార్యకర్తలను కూడా రోడ్డున పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ కుటుంబ గౌరవాన్ని , రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు.
చాలా రోజుల నుంచి ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్ కు పరిస్థితి వివరించినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు బాధను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం వరకు పలాసలోనే ఉండే దువ్వాడ ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చారని, ఎన్నికలయ్యాక ఆయనతో ఆమె అదే ఇంట్లో కలిసి ఉంటున్నారని వారు తెలిపారు.
దువ్వాడతో మాట్లాడేందుకు ఆయన కుమార్తెలు హైందవి, నవీన గురువారం అక్కవరం సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఆయన కుమార్తెలు వేచి ఉన్నప్పటికీ దువ్వాడ తలుపులు తీయకుండా గేట్లు వేసి, లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలని వారు ప్రశ్నించారు.
ఈ క్రమంలో దువ్వాడ విషయం ఏంటో అసలు తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో కలిసి వెళ్లారు . వాణి, ఆమె కుమార్తె అక్కడికి చేరుకున్నారనే విషయం తెలుసుకున్న దువ్వాడ, ఆయన సోదరుడు శ్రీధర్ ఆయన అనుచరులతో అక్కడకి చేరుకున్నారు.
రావడం రావడమే దువ్వాడ భార్య పై బూతు పురాణంతో రెచ్చిపోయారు. గ్రానైట్ రాడ్ ను తీసుకుని ఆమె పై దాడికి యత్నిస్తూ ఆమె మీదకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆమెకు వలయంగా మారి అడ్డుకున్నారు. ఆ సమయంలో అటు దువ్వాడ, ఆయన సోదరుడు, ఇటు వాణి, కుమార్తె హైందవి నలుగురు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. లెక్క తేలే వరకు ఇక్కడ ఉంటామని తల్లీకుమార్తెలు బైఠాయించారు.