/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/sai-1-jpg.webp)
Election Campaign : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి సినీ తారలు అందరూ కదలి వస్తున్నారు. ఇప్పటికే పవన్ తరుఫున ప్రచారం నిర్వహించేందుకు రంగంలోకి మెగా హీరోలు కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతుంది.
నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కూల్ డ్రింక్ బాటిల్ తో దాడికి దిగారు. అయితే, ఈ సంఘటనలో సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యింది. కంటి పై భాగంలో సీసా బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడ్ని చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
ఈ క్రమంలో బాధితుడ్ని పరామర్శించేందుకు టీడీపీ నేత ఎమ్మెల్యే వర్మ గాయపడిన శ్రీధర్ ను పరామర్శించి ఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. అంతకుముందు సాయి ధరమ్ తేజ్ రోడ్ షో.. తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా.. వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా సమాచారం. బాణసంచా కాలుస్తూ హడావిడి చేయడంతో.. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సాయి ధరమ్ తేజ్‌పై దాడికి ఏమైనా లింక్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Also read: నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు!