Explainer: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్..అసలు దీని వెనుక కథేంటి?

నాగార్జునసాగర్ దగ్గర పరిస్థితులు ఇంకా ఉద్రిక్తతగానే ఉన్నాయి. ఏపీ పోలీసులు బలవంతంగా నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో మొత్తం గొడవ అంతా ఒక్కసారి తెరమీదకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు అసలు ఎందుకు కృష్ణా జలాల కోసం గొడవ పడుతున్నారు? అసలేం జరిగింది అన్న చర్చ జరుగుతోంది.

New Update
Explainer: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్..అసలు దీని వెనుక కథేంటి?

Nagarjuna Sagar: తెలంగాణ పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల (Telangana Police) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు (AP Police) నాగార్జునసాగర్ దగ్గరకు చేరుకున్నారు. ఈ తరుణంలో అక్కడే కాపలా ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు ఏపీ పోలీసులు. అయితే అప్పుడే తెలంగాణ పోలీసులు అక్కడకు వచ్చి ఎందుకు తీయాలని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. ప్రాజెక్టు అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ అధికారులు 5వ గేటు నుంచి కుడి కాల్వలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణా రివర్ బోర్డు సభ్యులు డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు.

అసలు వివాదం ఎక్కడ? ఎలా మొదలయ్యింది?
భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తోన్న ఈ నది, పొడవులో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది.దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణా నది.. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, అక్కడి నుంచి తెలంగాణ, ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి, ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. అంటే నదికి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది.అంతేకాదు, ఏపీలో కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతం మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

Also Read: బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు

ఇన్ని వివాదాల నడుమ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండడం వలన ఈ రాష్ట్రానికి నీటి వాటా 37 శాతం వచ్చింది. ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండడం వలన నీటి వాటా 64 శాతం వచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అంతకు ముందు నుంచీ కూడా ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. దాన్నే విడిపోయిన తర్వాత కూడా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకోవాలని తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నాయి. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు, సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. అయితే ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ, ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా (Krishna Delta) తన హక్కు ఉపయోగించడం, దిగువన ఉండడం వంటివి కారణాలుగా ఉన్నాయి.

మామూలుగా అయితే సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకోవాలి. అలా కనుక తీసుకుంటే తెలంగాణకు ఎక్కువ టీఎంసీల నీరు రావాలి. లేదు అలా కాదు మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా, పరోక్షంగా రాయలసీమకు మేలు జరుగుతుంది. వీటిని ఆధారంగా చేసుకుని విడిపోయాక బేసిన్ రూల్ కోసం తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతున్నాయి. దాంతో పాటూ విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ మాత్రం విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని కోరుతోంది. అంతకుముందు తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి, తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ వాదించింది.అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది. కానీ
కేంద్రం మాత్రం పాత ట్రిబ్యునల్‌ని మరో రెండేళ్లు పొడిగించింది. అయితే తెలంగాణ మాత్రం అసలు మొత్తం కేటాయింపులు కొత్తగా చేయాలని పట్టుపడుతోంది. అయితే తెలంగాణ ప్రతిపాదనకు కర్ణాటక, మహారాష్ట్ర కూడా ఒప్పుకోలేదు. విడిపోయిన రెండు రాష్ట్రాలూ వాటి మధ్య పంపకాల సంగతి చూసుకోవాలి తప్ప, మొత్తం నది నీళ్లు తిరిగి పంపకాలు చేయడం భావ్యం కాదంటూ మహారాష్ట్ర, కర్ణాటక బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్పాయి. అక్కడితో ఆగిపోకుండా ఆ పాత తీర్పునే వెంటనే ప్రచురించాలని కోరుతూ ఆ రెండు రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళాయి.

ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. దీంతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని తమ వాటా నీటి వాటా కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ కోసం బోర్డులు ఏర్పాటయ్యాయి. వాటి రూల్స్ ప్రకారం శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలి. కాన నిబంధనలు పెట్టుకోవడం అయితే పెట్టుకున్నారు కానీ వాటిని సరిగ్గా మాత్రం అమలు చేయలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అటు వైపు ఏపీ అధికారులను రానీయడం లేదు. మరోవైపు నాగార్జున సాగర్‌ నిర్వహణ బాధ్యతలను తెలంగాణే చూసుకుంటోంది. కుడి కాలువ నుంచి ఏపీకి నీళ్ళు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా సార్లు కృష్ణాబోర్డు చెప్పినా తెలంగాణ.. ఏపీకి నీళ్ళు విడుదల చేయని సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు జరిగిన గొడవకూ దానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఈసారి అసలు నీళ్ళు విడుదల చేయమని ఏపీ ఒక్కసారి కూడా అడగలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు ఏపీ పోలీసులు వచ్చి.. 13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ అధికారులను అడగకుండానే.. నీటిని విడుదల చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు