CM KCR congratulates Telugu film Industry
హీరో అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు..
ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డు(69th National Film Awards)ల్లో.. తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను అభినందించారు. 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడు అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల ద్వారా తెలుగు సహా జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తన నటనా ప్రతిభతో మొట్టమొదటి జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర నటుడుకావడం., తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడుగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్పూర్తితో నేటితరం నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని కేసీఆర్ కొనియాడారు.
అవార్డులు పొందిన ఇతరులకు అభినందనలు..
అలాగే తన సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు (Oscar Award Winner Chandrabose) ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (DSP), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.
తెలుగు చలనచిత్ర రంగం నేడు హైదరాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని వెల్లడించారు.
తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలి..
తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా.. భారతీయ సినిమాతో పోటీపడుతుండడం గొప్ప విషయమన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం తమ ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: అటు ఆస్కార్.. ఇటు నేషనల్ అవార్డ్..ఒకే ఏడాదిలో డబుల్ ధమాకా!
చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. తెలుగు సినిమాకు అవార్డుల పంట