Khammam: దొంగబాబాల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమాయకుల అవసరాలను ఆసరాగా తీసుకుని హద్దులు మీరుతున్నారు. దుష్టశక్తులను పారద్రోలుతాం అంటూ కుచ్చుటోపీ పెడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తాంత్రిక పూజల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తమకు అతీత శక్తులున్నాయని, సమస్యేదైనా పరిష్కారం చూపుతామంటూ జనాలను నమ్మిస్తున్నారు. అనారోగ్య నివారణ పూజలు, కనుదిష్టి నివారణ, గుప్త నిధులకు, అఘోరా తాంత్రిక పూజల పేరుతో లక్షల రూపాయలను దొంగబాబాలు వసూలు చేస్తున్నారు. కాశీలో అఘోరాలతో తాంత్రిక పూజలు చేపించి కోరుకున్నది దక్కేలా చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.
దొంగబాబాల బారిన ధనవంతులు..
ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో మహిళపై సామాహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికపూజలు చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయంటూ మహిళకు మత్తు ఇచ్చిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్పృహలోకి వచ్చి అరవడంతో అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళ ఫిర్యాదుతో దొంగ సాధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగబాబాలు, నకిలీ సాధువుల అరాచకాలు, ఆగడాలు హద్దుమీరుతున్నా బాధితులు బయటకి రాకవడంతో దర్జాగా దోచుకుంటున్నారు. పరువు పోతుందని కొందరు, మనకెందుకులే అని మరికొందరు మౌనంగా ఉండటంతో ఆగంతకుల అగడాలు సాగుతున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొంగబాబాల బారిన పడుతున్నవారిలో ధనవంతులే ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: దుర్గాలను తొలగించే దుర్గమ్మ దర్శనం