/rtv/media/media_files/2025/09/01/telangana-legislative-council-2025-09-01-12-06-05.jpg)
telangana legislative council
BRS Members Protest: కాళేశ్వరం అంశం నిన్న శాసనసభలో నేడు శాసనమండలిలో మంటలు రాజేసింది. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు శాసనసభ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. కాగా ఈ రోజు ఇదే అంశంపై తెలంగాణ శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి (BRS) సభ్యులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించనున్నామని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మండలి ఛైర్మన్ పోడియాన్ని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రతులను బీఆర్‌ఎస్ సభ్యులు చించివేసి ఛైర్మన్ వైపు విసిరారు. ‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆ నిరసనల మధ్యే మండలి కొనసాగింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు రావొద్దని.. కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు.
అందుకు పోటీగా అధికార పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులను వారి వారి స్థానాల్లోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా.. బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని స్థానిక సంస్థల్లో 42 బీసీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించారు. అందుకు వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఎవరూ సమగ్ర సర్వేలో పాల్గొనలేదని.. కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇవ్వాలని బిల్లును ప్రవేశపట్టారు. అయితే, బీఆర్ఎస్ ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరిస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన అల్లోపతిక్ బిల్లులను ఏకగ్రీవంగా శానసమండలి ఆమోదించింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు.
మంత్రి సీతక్క ఫైర్
శాసనమండలిలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్ఎస్ బంధం తెగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టీఆర్ఎస్‌కు తెలంగాణ మాట పలికే అర్హత కోల్పోయిందని మంత్రి సీతక్క తెలిపారు.