బ్రిటిష్ చట్టసభలోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజు అరుదైన గౌరవంతో రికార్డ్

బ్రిటన్ రాజకీయాల్లో ఓ భారతీయుడు, ముఖ్యంగా తెలుగువాడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్ పీర్‌గా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.

New Update
Uday Nagaraju

బ్రిటన్ రాజకీయాల్లో ఓ భారతీయుడు, ముఖ్యంగా తెలుగువాడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్ పీర్‌గా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. చారిత్రాత్మకమైన ఈ సభలో ఆయన బుధవారం భగవద్గీతతో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఇక నుంచి ఆయన్ని అధికారికంగా ‘బ్లూమ్స్‌బరీ లార్డ్ నాగరాజు’గా పిలుస్తారు.

అతి పిన్న వయస్కుడిగా రికార్డు

యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సలహా మేరకు బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-III ఉదయ్ నాగరాజుకు ఈ ‘పీరేజ్’ను ప్రదానం చేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో చేరిన అతి పిన్న వయస్కుడిగా ఉదయ్ నాగరాజు ఘనత సాధించారు. పాలన, విద్య, సామాజిక ఆవిష్కరణల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే ఈ పదవితో ఆయన జీవితాంతం ఈ సభలో సభ్యుడిగా ఉండి చట్టాల రూపకల్పన, ప్రభుత్వ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ గౌరవం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శనిగరం నుంచి లండన్ వరకు 

ఉదయ్ నాగరాజు జన్మస్థలం సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఈయన సమీప బంధువు. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. మహారాష్ట్రలోని కిట్స్‌లో ఇంజనీరింగ్, అనంతరం ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో ఐటీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ (UCL)లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.

విలక్షణ మేధావి - ఏఐ నిపుణుడు
సాంకేతికత ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందో ముందుగానే పసిగట్టిన ఉదయ్ నాగరాజు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై అధ్యయనం చేయడానికి ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’ అనే థింక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దశాబ్ద కాలంగా బ్రిటన్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలపై పట్టు సాధించారు. 

Advertisment
తాజా కథనాలు