Medaram Sammakka Hundi : ఈ సంప్రదాయం మేడారంలో మాత్రమే.. సమ్మక్క హుండీ ఆదాయాన్ని ఏం చేస్తారో తెలుసా?

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారక్క జాతర అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అదేంటంటే జాతరలో హుండీ ద్వారా సమకూరిన ఆదాయంలో పూజారులకు మూడో వంతు (33.33 శాతం) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

New Update
medaram

Medaram Sammakka Hundi

Medaram Sammakka Hundi :  తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారక్క జాతర అత్యంత వైభవంగా ముగిసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జాతరలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఆదివాసీ ప్రధాన పూజారుల చేతులమీదుగా పూజలు నిర్వహిస్తారు. జాతర నిర్వహణ మొత్తం ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే సాగుతుంది. ఇక్కడి పూజారులు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ వారి సూచనల ప్రకారమే జాతర మొత్తం నిర్వహిస్తారు. కాగా  రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు భక్తుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. 2022లో కోటి మంది భక్తులు వస్తే, 2024లో కోటిన్నర మంది, ఈసారి దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇక హుండీ ఆదాయంలో వాటానే కాకుండా జాతర సందర్భంగా మంచినీటి దుకాణాలు, వైన్‌‌‌‌షాపులు, ఇతర టెండర్లలో స్థానిక పూజారులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.

పూజారులకు రూ.4.20 కోట్లు..

జాతర ఆదాయం విషయలో గిరిజన పూజారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మేడారం హుండీ కానుకల్లో 33.33 శాతం వాటా ప్రధాన పూజారుల కుటుంబాలకు అందజేస్తూ వస్తోంది. ఈ వాటాలో 13 వారసత్వ పూజారి కుటుంబాలు ఈ మొత్తాన్ని పంచుకుంటాయి. 2020, 2022 జాతరల్లో హుండీల ద్వారా సుమారు రూ.12 కోట్లు, 2024లో రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి హుండీల ఆదాయం రూ.14 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తంలో 33.33 శాతం మేరకు సుమారు రూ.4 కోట్ల 20 లక్షలు పూజారుల కుటుంబాలకు అందే అవకాశం ఉంది.  

ఈ మొత్తాన్ని సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజు, గోవిందరాజుల పూజారుల కుటుంబాలు పంచుకుంటారు. హుండీ ఆదాయంతో పాటు భక్తులు సమర్పించే బంగారం (బెల్లం)ను కూడా పూజారుల కుటుంబాలకే అప్పగిస్తారు. ఇక హుండీ ఆదాయంలో పూజారులకు కేటాయించిన ఆదాయంలో నుంచి 15 శాతం ఆలయాల అభివృద్ధి, దూపదీపాల కోసం రిజర్వ్ ఫండ్‌‌‌‌గా అందజేస్తారు. మిగిలిన 85 శాతాన్ని 13 ప్రధాన పూజారుల కుటుంబాలకు పంచుకుంటాయి. ఈ మొత్తంలో  ఒక్కో ప్రధాన పూజారికి సగటున రూ.26 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.  అయితే ఆయా కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో వారసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే వాటా అందుతోందని వారు వాపోతున్నారు. ఈ క్రమంలో మరింత వాటాకోసం గిరిజన పూజారులు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు