Kavitha : ఈ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు

తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి 40 స్థానాల్లో విజయం సాధించిందన్నారు.

New Update
FotoJet (4)

Telangana Jagruti President Kavitha

Kavitha : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘననీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 16 మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకో గలిగింది. ఒక కార్పొరేషన్‌ లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉండగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసిన తెలంగాణ జాగృతి 40 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని కామెంట్‌ చేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి , HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌ లతో కలిసి ఆమె మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి చేసిన పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని కవిత అన్నారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించిన తక్కువ సమయంలోనే ప్రజలు మమ్మల్ని ఆదరించారని కవిత చెప్పుకొచ్చారు.  జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన మున్సిపల్ ఎన్నికల్లో 40 మంది విజయం సాధించారన్నారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాకు స్పష్టమైన మెజార్టీ లభించిందని ఆమె వెల్లడించారు. అధికారికంగా 33 స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ , మరో 7 చోట్ల బీ ఫామ్ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచింది కూడా తమ అభ్యర్థులేనని కవిత తేల్చి చెప్పారు.

 బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది

గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితమైందని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో బీఆర్‌ఎస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు.కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుందన్న కవిత ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని సూచించారు.ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా సహకరించారని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలిమెట్టు అని కవిత ఆరోపించారు.కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోంది. కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అని కవిత ఆరోపించారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సాంబశివరావు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని, చాలా చోట్ల రీకౌంటింగ్ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కానీ త్వరలోనే జాగృతి ఆ లోటును భర్తీ చేస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి దక్కింది ఒక్క కరీంనగర్ మేయర్ తప్ప మరెక్కడ లేదన్నారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఓడిపోయారని కవిత ఎద్దేవా చేశారు.

గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలను, పరిమితులను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారని కవిత ఆరోపించారు.గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో, మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం నిర్వహించారన్నారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదన్నారు.గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్  తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉందన్న కవిత  కచ్చితంగా మాలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారని నమ్మకం ఉందన్నారు. 

ఈ ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి నేనే. నాకు ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నారు. ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీ లాక్కుంటా అని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నాడు. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలపై ముందు దృష్టి పెట్టాలని కవిత కోరారు.ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ..ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను బెదిరించి పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ తమ అభ్యర్థులు లొంగరని బోజిరెడ్డి స్పష్టం చేశారు. రానున్న సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్, తెలంగాణ జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. కార్మికుల హక్కుల కోసం పనిచేసేది తామేనని, అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.  

Advertisment
తాజా కథనాలు