Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

తెలంగాణ దారులన్నీ..ఇపుడు మేడారం బాట పట్టాయి. చిన్నా..పెద్ద..పేద..ధనిక అనే తేడా లేకుండా అంతా అడవిబాట పట్టారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి వచ్చే మేడారం కుంభమేళను దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం తరలిపోతున్నారు. 4 రోజుల పాటు మేడారం భక్తజన గుడారంగా మారనుంది.

New Update
FotoJet (38)

Medaram Jatara

Medaram Jatara : తెలంగాణ దారులన్నీ..ఇపుడు మేడారం బాట పట్టాయి. చిన్నా..పెద్ద..పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా అడవిబాట పట్టారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి వచ్చే మేడారం కుంభమేళను దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం తరలిపోతున్నారు. ఎండ్లబండ్లు, కార్లు, జీపులు, బస్సులు.. ఒకటేమిటీ ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనాల్లో అమ్మలు నడయాడిన నేల మట్టిని నుదుట దిద్దుకోవడానికి బయలుదేరుతున్నారు. మానవజన్మ ఎత్తి తమను నమ్మిన జనం కోసం కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క..సారక్కల అమ్ముల పొదిని కళ్లరా చూసి తరించడానికి ఇసుకవేస్తే రాలనంత జనం తరలివెళుతున్నది..నాలుగు రోజుల పాటు భక్తజన గుడారంగా మారే మేడారం జాతర ప్రత్యేకతలపై కథనం...

ఎవరీ దేవతలు ?

సమ్మక్క, సారక్కలు అక్కచెల్లెళ్లు అని అందరూ అనుకుంటారు. కానీ వారిద్దరూ తల్లి కూతుళ్లు. సమ్మక్క తల్లి, సారక్క(సారలమ్మ) బిడ్డ. ఆదివాసి తెగలో పుట్టిన వారు తమ గిరిజనజాతికోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందారు. అందుకే వారు గిరిజనులకు దేవతలయ్యారు.

సమ్మక్క కథనం..

12 వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడ రాజు ఏకైక కూతురు సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి  చేశారు. వీరిద్దరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం . అయితే, కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న మేడరాజు, పగిడిద్దరాజులు వరుసగా ఏర్పడిన కరువుతో కప్పం చెల్లించలేకపోయారు. మొదట కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. మేడరాజుపై దాడిచేసిన కాకతీయులు ఆయనను ఓడించడంతో తన అల్లుడైన పగిదిద్దరాజు చెంతకు చేరి అజ్ఞాతవాసం గడుపుతాడు. . అదే క్రమంలో పగిడిద్దరాజు కూడా పన్ను చెల్లించని కారణంగా అంతే కాదు మేడరాజుకు ఆశ్రయం కల్పించాడని, తిరుగుబాటు భావాలు పెంచుతున్నాడన్న ఆరోపణలతో ప్రతాపరుద్రుడు ఆగ్రహించి, తన మంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. కాకతీయులతో పోరాడిన ధీర చరితలు సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడినా, అపార కాకతీయ సేనల ముందు ఓడిపోతారు.ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందుతారు.ఈ వార్త విన్న జంపన్న, అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. అపర కాళిలా కాకతీయులపై విరుచుకుపడిన సమ్మక్క కాకతీయుల వెన్నుపోటుతో చిలకలగుట్ట పైకి వెళ్లి అంతర్దానమయ్యింది.  సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ప్రజలకు ఎంత వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణెలు కనిపించాయి. వాటిలో  కుంకుమ భరణిని సమ్మక్కగా .. పసుపు భరణి సారక్కగా భావించి ప్రతి రెండేళ్ల కొకసారి  మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతారు. తెలంగాణా రాష్ట్రం మేడారం జాతరను అధికారిక పండుగగా నిర్వహిస్తుంది.

మరో కథనం..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఈ బయ్యక్కపేట గ్రామంలోనే సమ్మక్క తల్లి జన్మించిందని చరిత్ర చెబుతోంది. పూర్వకాలంలో కోయదొరలు వేటకు వెళ్లిన సమయంలో గ్రామ శివారులోని అడవిలో వెదురుచెట్టు కింద పెట్టలో, పెద్దపులుల కాపల మధ్య బంగారు వర్ణ ఛాయతో వెలిగిపోతున్న ఓ పసికందు వారికి దర్శనమిచ్చిందని కథనం.ఆ పాపను తమ గూడేనికి తీసుకెళ్లినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో, ఆ కొండదేవతే మానవరూపంలో వచ్చిందని కోయదొరలు విశ్వసించారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు ‘సమ్మక్క’ అని నామకరణం చేశారు. అప్పటి కోయ చక్రవర్తి మేడరాజు ఆమెను తన కుమార్తెలా పెంచి పెద్ద చేశాడని స్థానికులు చెబుతున్నారు. చందా వంశస్థులు ఈ రోజుకీ సమ్మక్కను తమ ఇంటి ఆడబిడ్డగా గర్వంగా చెప్పుకుంటారు. యుక్త వయసు వచ్చేవరకు బయ్యక్కపేటలోనే పెరిగిన సమ్మక్క తల్లి, అనంతరం సామాన్యుల మధ్య ఉండలేక పక్కనే ఉన్న దేవరుగుట్టకు వెళ్లిందని చందా వంశీయులు వివరిస్తున్నారు. ఆ గుట్టపై అమ్మవారి అవసరాల కోసం ఏర్పడిన బావిని ఇప్పటికీ ‘జలకభావి’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో సమ్మక్క తల్లి సంచరించిన ఆనవాళ్లు ఇప్పటికీ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర

 మేడారం మహా జాతర ... ప్రపంచంలోనే ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద మహా జాతర ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి మహా జాతర తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీప్రాంతంలో జరుగుతుంది. గిరిజనులు, ఆదివాసీలు, అతి సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా తరలివచ్చే మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల నుండి కోట్లాదిమంది భక్తజనం తరలివచ్చి తల్లులను దర్శించుకుంటారు. నాలుగు రోజుల పాటు సాగే మేడారం జాతరలో మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజుతోపాటు కొండాయిగూడెం నుంచి గోవిందాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకొస్తారు. జనవరి 28వ తేదీన కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెల మీదికి తీసుకువస్తారు. 29వ తేదీన చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దె మీదకు తీసుకువస్తారు. ఇద్దరు మేడారం చేరుకోవడంతో జాతర ఊపందుకుంటుంది.  

బంగారం నైవేద్యం

గిరిజన కుంభమేళాగా గుర్తించబడిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా బంగారాన్ని సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి గిరిజనుల భాషలో బంగారం అంటే బెల్లం. సమ్మక్క సారలమ్మలను పూజించే భక్తులు, తమ కోరికలు తీర్చే తల్లికి నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా పెడతామని చెబుతారు. కోరికలు తీరితే అదేవిధంగా నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. బంగారాన్ని నివేదించటం వెనుక అనేక కారణాలున్నాయి.గతంలో మేడారం రాజ్యంలో కాకతీయ రాజులకు కప్పంగా బంగారాన్ని చెల్లించేవారు. ఇక అటువంటి బంగారాన్ని(బెల్లం) తమకోసం కాకతీయ రాజులతో పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలకు కృతజ్ఞతగా గిరిజన కోయలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చిందని చెబుతున్నారు. బంగారం అంటే బెల్లం పాడుకానిది. ఎప్పటికీ నాశనం కాని పదార్థం. సమ్మక్క సారలమ్మలు చరిత్ర నిలిచినంతకాలం నిలిచే ఉంటారు. అలా నిలిచిఉండే తల్లులకు ఎప్పటికీ నాశనం కాని బంగారాన్ని సమర్పించాలి అనేది వారి ఉద్దేశం. అంతేకాదు బెల్లం చెరకు నుండి తయారు చేస్తారు. ప్రకృతి ప్రసాదించిన చెరకు నుండి వచ్చేది బెల్లం కాబట్టి ఆ బెల్లాన్ని అమ్మకు నైవేద్యంగా పెడితే తల్లి సంతోషించి కరుణిస్తుందని గిరిజన కోయలు విశ్వసిస్తున్నారు. అడవి బిడ్డలు బెల్లాన్ని నైవేద్యంగా నివేదించడం గౌరవానికి సూచన అందుకే అమ్మవారికి బంగారాన్ని నైవేద్యంగా పెడుతున్నారు.

జన మహాసముద్రం

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వన్య ప్రాణుల నిలయం ఏటూరునాగారం అభయారణ్యం మొత్తం 812చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ అభయారణ్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఉంది. ఇక ఈ ప్రాంతంలోనే తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతర అరణ్య ప్రాంతాన్ని భక్తి మహాసముద్రంగా మార్చేస్తుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి కోటికి పైగా భక్తులు తరలివస్తారు. సమ్మక్క–సారలమ్మ, పరిగిద్దరాజు, గోవిందరాజుల దర్శనం కోసం అడవిబాటలు కూడా భక్తులతో కిటకిటలాడతాయి. వనదేవతల త్యాగగాథను స్మరించుకుంటూ జరుపుకునే ఈ జాతర గిరిజన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  

ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 251 కోట్లు ఖర్చు చేసింది. 21 శాఖలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందిని, 2000 మంది ఆదివాసీ వాలంటీర్లను భక్తుల సేవ కోసం నియమించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 13,000 మంది పోలీసులను మోహరించారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డ్రోన్లతో జాతరను పర్యవేక్షిస్తున్నారు. 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 200 మంది గజ ఈతగాళ్లను, 30 వైద్య శిబిరాల్లో 5,192 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పారిశుద్ధ్యం కోసం 5,000 మంది కార్మికులు, 5,700 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల రవాణా కోసం టీజీఎస్ఆర్టీసీ 4,000 ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పర్యాటక శాఖ హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తోంది. రౌండ్ ట్రిప్‌తో కూడిన వీఐపీ దర్శనానికి రూ. 35,999, జాతర ఏరియల్ వ్యూ కోసం ఒక్కొక్కరికి రూ. 4,800 చొప్పున ఛార్జీలను నిర్ణయించారు.

-మధుకర్‌ వైద్యుల, సీనియర్‌ జర్నలిస్ట్‌
8096677409

Advertisment
తాజా కథనాలు