/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
KTR
BRS Working President KTR: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటుందని అనుకున్నప్పటికీ, కొంత తగ్గిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయన్నారు. తమ పార్టీ కార్యకర్తలు గట్టి పోరాటం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని అసంతృప్తిగా ఉందన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయించి బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదన్నారు.వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని కేటీఆర్ అన్నారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది, హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గణనీయంగా మెరుగుపడిందని కేటీఆర్ తెలిపారు.ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ తమ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసింది. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అన్నారాయన. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదన్నారు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారన్నారు.ప్రస్తుతం ఉన్న నిబంధనల పైన ఎవరికీ స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు.
ఇక ఫార్ములా కేసు విషయమై మాట్లాడుతూ మరోసారి ఫార్ములా ఈ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నది. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా పోతాము, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతాము. ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు. చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని కేటీఆర్ అన్నారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.
Follow Us