/rtv/media/media_files/2025/01/30/LMGSAQXwlK2dQl4Xykvr.jpg)
ts high court Photograph: (ts high court)
గ్రూప్–1 నియామకాలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ వాల్యూషన్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లపై గురువారం విచారణ చేపట్టింది. తుది తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని టీజీపీఎస్సీకు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టీఫికెట్ల వెరిఫికేషన్‌ను కొనసాగించేందుకు మాత్రం హైకోర్టు వెసులుబాటు కల్పి్స్తూ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.
గ్రూప్–1 పోస్టులు భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష పత్రాల వాల్యూషన్లో అవకతవకలు జరిగాయంటూ దీనిపై న్యాయ విచారణ జరిపించాలని సిద్దిపేట లోని శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ వేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. తమ సమాధాన పత్రాలను సరిగ్గా వాల్యూషన్ చేయలేదని.. జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని వారు తమ పిటిషన్ లో డిమాండ్ చేశారు. తమ జవాబు పత్రాలను తిరిగి వాల్యూషన్ చేసేలా లేదా తిరిగి మెయిన్స్ పరీక్షను నిర్వహించేలా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.
రచనారెడ్డి హైకోర్టులో వాదనలు
పిటిషనర్ తరుప సీనియర్ న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక కావడం సందేహాస్పదంగా ఉందన్నారు. మొత్తం 563 పోస్టుల్లో ఇది దాదాపు 12 శాతం. మెయిన్స్‌కు తొలుత 21వేల 75 మంది హాజరయ్యారని ప్రకటించి, ఆ తర్వాత 21 వేల 85 మంది అని పేర్కొన్నారు. ఈ 10 మంది ఎలా పెరిగారో వెల్లడించలేదని రచనా రెడ్డి వాదించారు. . ఉర్దూలో 9 మంది రాస్తే.. 10 మంది అని చెప్పారని ఇది సందేహాస్పదంగా ఉందని ఆమె కోర్టులో తన వాదనలు వినిపించారు. ఇక జనరల్ ర్యాంకింగ్ ప్రకటన సమయంలో కంప్యూటర్‌లో మార్పులు చేశారన్న రచనా రెడ్డి.. లాగ్డ్ హిస్టరీ పరిశీలిస్తే నిజం తేలుతుందని వాదించారు. అయితే దీనిపై ప్రశ్నిస్తే ఆ వివరాలు మీకెందుకంటూ బెదిరిస్తున్నారని.. 482 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గడం మరీ విచిత్రంగా ఉందన్నారు . పరీక్షా కేంద్రాల పెంపు, ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్ల నంబర్ మార్పుపై స్పష్టత లేదని తన వాదనలు వినిపించారు.
పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి తాత్కలికంగా నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి వివరాలను సమర్పించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్లు తప్పుడు వివరాలను దాఖలు చేసినట్లు నిరూపితమైనా, టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని తేలితే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే ఇంప్లీడ్ కాకుండా వాదనలు వినిపించడం సరికాదంటూ రీ కౌంటింగ్‌లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పిన ఓ అభ్యర్థిని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషన్ దాఖలు చేసుకోవాలని అతనికి సూచించింది.