/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t111257270-2025-11-07-11-15-10.jpg)
Godavarikhani : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మలను తొలగించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ కూల్చివేతలు కొనసాగాయి. దారి మైసమ్మల కూల్చివేతలు స్థానికుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.ఏకంగా పాత కాలం నాటి భక్తి స్థలాలుగా భావించే దారి మైసమ్మ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానిక భక్తజనులను కలచివేసింది. తెలంగాణలో రాయినీ దేవుడిగా భావించే ఆచారం వేల ఏళ్లుగా కొనసాగుతోంది. రహదారి పక్కన ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని నమ్మి ప్రజలు దారి మైసమ్మలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ వస్తుంటారు. ఇదిలా ఉంటే గోదావరిఖని పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న ఈ మైసమ్మ విగ్రహాలను కూల్చివేశారు. స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు వ్యాపారస్తులు వారి దుకాణాల సముదాయాల ముందు ఉదయం లేచి చూసేసరికి మైసమ్మ విగ్రహం లేక పోవడంతో షాక్‌కు గురయ్యారు. చుట్టు పక్కల విచారించగా, రాత్రి వేళల్లో ఎవరో వ్యక్తుల విగ్రహాలను కూల్చివేసినట్టు భావిస్తున్నారు.
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని దారి మైసమ్మ విగ్రహాలను తీసివేయడం ఇప్పుడూ చర్చ నీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. మైసమ్మ విగ్రహాలను కూల్చడం పాపం… ఇది ప్రజల నమ్మకాన్ని అవమానపరచడం అంటూ మండిపడుతున్నారు. దారి మైసమ్మ మా ఊరి ఆత్మ.. ఆమె కూల్చేస్తే మన ఊరికి కాపాడే శక్తి తగ్గిపోతుంది” అంటూ పెద్దవారు విచారం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో కొంతమంది స్థానికులు ఇది మున్సిపల్ సిబ్బందిచే జరిగిందా, లేక ప్రైవేటు కాంట్రాక్టర్లు రోడ్డు పనుల కోసం కూల్చారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. పట్టణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ధార్మిక భావాలను దెబ్బతీసే ఈ చర్యపై విభిన్న వర్గాల ప్రజలు ఖండన వ్యక్తం చేస్తున్నారు. “రోడ్డు మీద ఉన్నా, మైసమ్మ అంటే భక్తి, నమ్మకం… దాన్ని కూల్చడం మానవత్వానికి విరుద్ధం” అంటూ స్థానికులు వ్యాఖ్యానించారు.
కాగా ఆలయాల కూల్చివేతలను నిరసిస్తూ బీజేపీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపారు. చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద దారిమైసమ్మకు పూజలు చేశారు. దారిమైసమ్మ విగ్రహాలు, ఆలయాలు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆలయాలను కూల్చివేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్‌హరి డిమాండ్ చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ వేదిక ఆధ్వర్యంలో కూల్చివేసిన దారిమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. . కాగా, దారిమైసమ్మ ఆలయాల కూల్చివేతపై శుక్రవారం పోచమ్మమైదాన్‌లో హిందూ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ భేటీ కానుంది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీ సిబ్బందే ఆలయాలను కూల్చివేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతున్నామని. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. ఈమేరకు దారిమైసమ్మ గుడులు కొన్ని తొలగించాం. వీటిపై చాలా ఫిర్యాదులు రావవడంతో నెలరోజుల కిందట రోడ్డు సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ముందుకెళ్లాం. అని వివరించారు.
ఇది కూడా చదవండి: అక్కడ నొక్కితే పొట్టలోని గ్యాస్ బస్సుమంటూ బయటకొచ్చేసింది తెలుసా!!
Follow Us