/rtv/media/media_files/2025/09/05/nalgonda-minor-girl-rape-case-2025-09-05-12-22-36.jpg)
Nalgonda Minor Girl Rape Case
రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా.. ముసలి ముతక అని తేడా లేకుండా క్రూరమృగాళ్ల కొందరు ప్రవర్తిస్తున్నారు. మానవత్వం మరిచి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పక్కనే ఉంటూ మంచి వారిలా నటించి ఆఖరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కన్న కూతురి వయసున్న చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదు. అభం శుభం తెలియని బాలికలపై పాడుబుద్ధి చూపిస్తున్నారు. ఒక స్త్రీ ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడా లేని కామం తన్నుకొస్తుంది.
వద్దు వద్దు అని ఎంత వేడుకున్నా వదలడం లేదు. భయపెట్టి, బెదిరించి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వాలు, అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన ఇద్దరు కామాంధులకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన శిక్ష విధించింది. ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో వారికి 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష వేసింది. అలాగే భారీ జరీమాన కూడా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Nalgonda Minor Girl Rape Case
ముకుటోజు భాస్కరాచారి అనే వ్యక్తి ఒక లారీ డ్రైవర్. అతడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. 2018 మార్చి 9న అతడు పాడుబుద్ధి చూపించాడు. రెండో తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఆ చిన్నారిని ఇంట్లోకి పిలిచాడు. ఆపై ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన ఆ బాలిక కడుపులో నొప్పి నొప్పి అంటూ ఏడవడం మొదలు పెట్టింది. దీంతో ఏం జరిగింది? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నించగా.. ఆ చిన్నారి జరిగిన విషయం బయటపెట్టింది.
వెంటనే వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన దేవరకొండ పోలీసులు నిందితుడ్ని విచారించి అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆపై నిందితుడు అత్యాచారం చేసినట్లు నేరం నిర్ధారణ కావడంతో పోక్సో చట్టం ప్రకారం.. న్యాయమూర్తి అతడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానాను విధించారు. అదే సమయంలో బాధిత చిన్నారికి రూ.10 లక్షలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు.
ఇలాంటిదే మరొక ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తిప్పర్తి యాదయ్య అనే వ్యక్తి కూతురి వయసున్న బాలికపై అత్యాచారం చేశాడు. 2016 డిసెంబర్18న అతడు తన గ్రామంలోనే ఓ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో 11 ఏళ్ల బాలిక తప్ప మరెవరూ లేరని గమనించి.. తన కామ కోరికలను ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆ బాలికను కత్తితో బెదిరించి అత్యాచార యత్నం చేశాడు.
దీంతో బాలిక అడ్డుకోవడంతో.. ఆమెను బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్నంతా ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు చండూరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి యాదయ్యను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడిపై నేరం రుజువు కావడంతో భారీ శిక్ష విధించింది. యాదయ్యకు కూడా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.25 వేల జరిమానా వేసింది. ఇది మాత్రమే కాకుండా బాలికను బెదిరించినందుకు గానూ ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, అలాగే అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించినందుకు గానూ మరో ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించారు. ఈ కేసులోనూ చిన్నారికి రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.