Revanth Vs Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డా మాజాకా.. ప్రభుత్వాన్ని కాదని మునుగోడుకు ప్రత్యేక రూల్స్!

తనకు రాష్ట్ర ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని.. మునుగోడులో తన రూల్స్ కు ఒప్పకున్న వారే వైన్స్ కు టెండర్ వేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని.. బెల్ట్ షాపులకు అమ్మొద్దని స్పష్టం చేశారు.

New Update
Revanth Rajagopal reddy

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఆయన ఆశావహులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లు వేయాలంటే తన రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. టెండర్లు దక్కించుకోవాలంటే ప్రతీ రోజు సాయంత్రం 4 గం.ల నుండి రాత్రి 8 గం.ల వరకు మాత్రమే మద్యం అమ్మాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలన్నారు. ఇతర మండలానికి చెందిన వారు టెండర్లు వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాప్ లు ఊరి బయట మాత్రమే పెట్టాల్సి ఉంటుందన్నారు.

ఇంకా వైన్ షాప్ కు అనుబంధంగా (సిట్టింగ్) పర్మిట్ రూమ్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దన్నారు. వైన్స్ దక్కించుకున్న వారు సిండికేట్ అయితే ఊరుకునేది లేదన్నారు.  లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్ ల నిర్మూలన, మహిళల సాధికారతే తన లక్ష్యమని తేల్చి చెప్పారు.

మునుగోడు నియోజకవర్గంలో ఈ రూల్స్ పాటించే వారు మాత్రమే వైన్స్ షాపులకు టెండర్లు వేయాలన్నారు. రాజగోపాల్ రెడ్డి తాజా వార్నింగ్ తో నియోజకవర్గంలో వైన్స్ షాపులకు టెండర్లు వేయడానికి ఆశావహులు భయపడుతున్నారు. ఒక వేళ తమకు లాటరీలో షాప్ వస్తే ప్రభుత్వానికి లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని.. రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్స్ పాటిస్తే తమకు ఏం మిగలదని వారు చెబుతున్నారు. 

ఇప్పటికే రాష్ట్రంలో వైన్స్ షాప్ కు తక్కువ సంఖ్యలో టెండర్లు వస్తుండడంతో ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి తాజా ప్రకటనతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్స్ పై ఎలా స్పందించాలో తెలియక వారు సతమతమవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడంతో ఏమి అనలేకపోతున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు