Uttam Kumar Reddy: ఈ మధ్య కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని వారి అనుచరులు, పీఏలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ అంటూ ఓ వ్యక్తి కోదాడ సీడీపీఓ కార్యాలయయంలోని సూపర్ వైజర్ గా పని చేస్తున్న ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి బెదిరింపులు ఆమెకు మాత్రమే కాదు.. చాలా మంది సూపర్ వైజర్లకు వచ్చినట్లు సదరు మహిళ తెలిపింది. ప్రస్తుతం కాల్ చేసి బెదిరింపులకు పాల్పపడిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ అంటూ పదే పదే..
కోదాడ సీడీపీఓ కార్యాలయయంలోని సూపర్ వైజర్ గా పని చేస్తున్న ఓ మహిళకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ అంటూ పదే పదే కాల్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. ‘నేను మంత్రి ఉత్తమ్ కుమార్ పర్సనల్ పీఏ అని.. నా పేరు నరేష్ రెడ్డి అంటూ ఫోన్ చేశాడు. నేను హుజూర్‌నగర్ ప్రాంతంలో వేరే సూపర్ వైజర్లతో కూడా మాట్లాడాను. మీకు కానీ, మీ అంగన్ వాడీ టీచర్లకు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు. కొన్ని సమస్యలు ఉన్నాయండీ అని చెప్పారు. మీకు రెండు రోజుల్లో ఉత్తమ్ కుమార్ సార్ తో మీటింగ్ అరేంజ్ చేస్తాను. మీరు ఒక వెహికిల్ రెడీ చేసుకొని సమస్యలు ఉన్న టీచర్లు అందులో రండి అని చెప్పాడు. అలా రెండు మూడు సార్లు కాల్ చేశాడు. మీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడుతారు.. ఈ నెంబర్ ఆయితే ఫీడ్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మనకు ఎందుకు కాల్ చేస్తారు. అందుకే నేను ఆ నెంబర్ సేవ్ చేసుకోలేదు.పాలకీడు రమాదేవి డిటేల్స్ నాకు పెట్టారు.. ఆ డిటేల్స్ మీకు పంపాను చూడండి అని వాట్సాప్ కాల్ చేశాడు. ఈలోగా ఆ మేడం నాకు ఫోన్ చేసి ఎవరో మన డిటేల్స్ అడుగుతున్నాడు.. మంత్రి పీఏ అంటున్నాడు. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పింది’.
ఫోన్ లో మాటలు రికార్డు..
‘నాకు వరుసగా వాట్సాప్ కాల్స్ చేస్తూ వస్తున్నాడు. నేను మా ఆఫీస్ ఫోన్ తో ఆయనకు కాల్ చేసి ఆయన మాటలు రికార్డు చేశాను. నువు చాలా అందంగా ఉన్నావు.. ఓకే అంటే ఎంత డబ్బైనా ఇస్తాను అంటూ బ్యాడ్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ మాటలు విన్న తర్వాత అతన్ని తిట్టాను. చాలా అసహ్యంగా మాట్లాడుతూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. తర్వాత అవన్నీ డిలీట్ చేశాడు. అవన్నీ నేను మా గ్రూప్ మెంబర్స్ కి ఫార్వార్డ్ చేశాను. తర్వాత నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. మర్డర్ కేసులో నేను మూడుసంవత్సరాలు చర్లపల్లి జైల్లో ఉండొచ్చాను. తల పగలకొట్టి చంపాను.. మర్డర్స్ నాకు కొత్త కాదు. అలాగే నీ గురించి, నీ అడ్రస్ గురించి తెలుసుకోవడం నాకు మూడు రోజుల పని. నీకు మాత్రమే పోలీసులు తెలుసా? నాకు కూడా చాలా మంది పోలీసులు తెలుసు అన్నాడు.
వదిలే సమస్య లేదు..
నీన్ను పది సంవత్సరాలైన వదిలే సమస్య లేదు అంటూ బెదిరించాడు. నేను వెంటనే ఆ రికార్డు కలెక్టర్, డీడబ్ల్యూఓ సార్ కి పంపించాను. ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..అలర్ట్ గా ఉండండి అంటూ మా గ్రూప్ లో ఫార్వార్డ్ చేశాను. ఆ తర్వాత మా సూపర్ వైజర్లు అందరూ తమకు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయని అన్నారు. ఆ వ్యక్తి సూర్యాపేట నుంచి నేను జగదీశ్వర్ రెడ్డి మనిషి అంటూ కాల్ చేశాడట. నేను మంత్రి వెంకట్ రెడ్డి సార్ పీఏకి కాల్ చేసి చెప్పాను. ఈ విషయం సీరియస్‌గా తీసుకున్న ఆయన జిల్లా ఎస్పీ కి కాంప్లెంట్ చేశారట. తర్వాత షీటీమ్, సూర్యాపేట డీఎస్పీ కి అతడు మాట్లాడిన వాయిస్ రికార్డు షేర్ చేశాను. కేవలం సూర్యపేట పరిధిలో పనిచేసిన వారినే అతడు టార్గెట్ చేసుకున్నాడు. అతని డిటెట్స్ కొత్తగూడెంలో ఉంటున్నట్లు వచ్చిందని మాకు తెలిసిన సీఐ ఒకరు చెప్పారు. కానీ నాకు అతను పంపించిన కరెంట్ లొకేషన్ మాత్రం తెనాలి. నేను డీఎస్పీకి కాల్ చేసిన తర్వాత ఆయన మళ్లీ నాకు కాల్ చేసి ఆ వ్యక్తి సైకో అని అతన్ని ట్రాప్ చేసి పట్టుకుంటామని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.