BIG BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మరో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
Telangana Local Elections 2025

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను చేర్చారు. ఈ పిటిషన్ ఈ నెల 6న విచారణకు రానుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి నేత మాధవ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 

తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ఇంకా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉంది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. అయితే.. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై ఈ నెల 8న క్లారిటీ వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ రోజు కోర్టు స్టే ఇస్తే ఎన్నికలు ఆగుతాయని.. లేకపోతే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని అంటున్నారు. 

అప్పుడే మొదలైన ఖర్చు..

కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆగితే ఆలస్యం అవుతుందని.. ఎన్నికలు జరిగితే ఇబ్బంది అవుతుందని పలు చోట్ల అభ్యర్థులు ఖర్చు ప్రారంభించారు. దసరా రోజు దావత్ తో పలు గ్రామాల్లో ప్రచారం మొదలైందని తెలుస్తోంది. కానీ ముఖ్య నేతలు మాత్రం అనవసరంగా తొందరపడొద్దని తమ అనుచరులకు చెబుతున్నారు. ఎన్నికలు జరగకపోతే ఇబ్బంది అవుతుందని హెచ్చరిస్తున్నారు. 8న హైకోర్టు విచారణ తర్వాత మాత్రమే పోటీ, ప్రచారం తదితర అంశాలపై ఆలోచించాలని స్పష్టం చేస్తున్నారు. 

సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది?

ఇటీవల హైకోర్టులో విచారణ సందర్భంగా సైతం పిటిషన్ వేసిన వారి తరఫు లాయర్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను పలుమార్లు ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానానికి వివరించారు. ఒక్క బీసీలకే 42 శాతం ఇవ్వడం సరికాదన్నారు. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సూచిస్తుందా? లేదా విచారణ చేపడుతుందా? స్టే ఇస్తుందా? అన్న అంశాలపై అభ్యర్థులు, ప్రధాన పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు