/rtv/media/media_files/2025/09/30/telangana-local-elections-2025-09-30-19-19-46.jpg)
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ఈసీ నిన్న నగారా మోగించిన విషయం తెలిసిందే. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి తొలివిడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు.. అక్టోబర్ 17 నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. వాస్తవానికి ఓ వైపు దసరా, మరో వైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి జోరుగా ఉండాలి. కానీ పల్లెల్లో మాత్రం ఆ వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చెల్లదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. పాత పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ రెండు అంశాలు పెండింగ్ లో ఉన్న సమయంలో తీసుకువచ్చిన జీవో చెల్లదన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్న కోర్టు కూడా ఇదే అంశాలపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. బీజేపీ కీలక నేత, బలమైన బీసీ నేత అయిన ఈటల రాజేందర్ కూడా అభ్యర్థులు తొందరపడి ఖర్చు పెట్టొద్దని.. ఆగం కావొద్దని ఇప్పటికే హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో న్యాయ సమీక్షకు నిలబడదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ కలిసి వచ్చిందని సంతోష పడి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలా? లేక 8న కోర్టు కేసు తేలే వరకు ఆగాలా? అన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
టెన్షన్ పెట్టిస్తున్న మహారాష్ట్ర కేసు..
గతంలో మహారాష్ట్రలో రిజర్వేషన్లు పెంచి నిర్వహించిన స్థానిక ఎన్నికలను కోర్టు రద్దు చేసిన అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఒక వేళ ఎన్నికలు జరిగినా రద్దు ఖాయమన్న ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. దీంతో ఆశావహుల్లో ఆందోళన డబుల్ అవుతోంది. రిజర్వేషన్లు కలిసి వచ్చినా.. ఆనందం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ఈటెల రాజేందర్ బీజేపీ,ఎంపీ*
— NageshT (@NageshT93116498) September 30, 2025
స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చన్న ఈటల
సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని హితవు
తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి- ఈటల
లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి-ఈటల… pic.twitter.com/tNdcfs84Un
8న ఏం జరిగే ఛాన్స్ ఉంది?
రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో పై అక్టోబర్ 8న హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఎన్నికలపై స్టే ఇవ్వడం లేదా పిటిషన్ ను కొట్టి వేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు చేయకుండా విచారణను వాయిదే వేసే అవకాశం కూడా ఉంది. మొదటి రెండు ఆప్షన్లలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికలపై కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. స్టే ఇస్తే ఎన్నికలు ఆగుతాయి. అలా కాకుండా పిటిషన్ కొట్టి వేస్తే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకోకుండా మొన్నటి లాగే విచారణను మళ్లీ వాయిదా వేస్తే అభ్యర్థులు అయోమయంలో పడడం ఖాయమన్న చర్చ సాగుతోంది.