/rtv/media/media_files/2025/09/19/ponguleti-srinivas-reddy-2025-09-19-16-13-39.jpg)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. బీఆర్ఎస్ ఊపు ఉన్న సమయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి సత్తా చాటారు పొంగులేటి. తనతో పాటు జిల్లా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించి తన బలాన్ని చాటారు పొంగులేటి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత దక్కకడం లేదని భావించి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు తన సహకారం అందించి వారి గెలుపుకు కృషి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపులో తనదైన పాత్ర పోషించారు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జలగం వెంగళరావు, సంభాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, రేణుకా చౌదరి లాంటి టాప్ లీడర్లు చక్రం తిప్పిన ఖమ్మం కాంగ్రెస్ లో ఆయన ఇప్పుడు కీలకంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రానుంది. ఈ సినిమాకు 'శ్రీనన్న.. అందరివాడు' అందరి వాడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. బయ్యా వెంకట నర్సింహ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా ఉన్నారు. కాసర్ల శ్యామ్ పాటలు రాస్తున్నారు. శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి పాత్రను ప్రముఖ హీరో సుమన్ పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.
"శ్రీనన్న అందరివాడు" పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్
— dktimestelugu (@dktimestelugu) September 19, 2025
సినిమాలో పొంగులేటి పాత్రను పోషించనున్న సీనియర్ నటుడు సుమన్
శ్రీనన్న అందరివాడు అనే టైటిల్‌తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్న దర్శకుడు బయ్యా వెంకట నర్సింహ రాజ్ pic.twitter.com/uryaenPLMy
అయితే.. ఈ సినిమాలో పొంగులేటి కష్టపడి సాధారణ కాంట్రాక్టర్ స్థాయి నుంచి ప్రముఖ కాంట్రాక్టర్ గా మారిన అంశాలతో పాటు రాష్ట్రంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో ఆ పార్టీని ఎంచుకుని ఎంపీగా గెలిచిన తీరుపై ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అనంతరం బీఆర్ఎస్ లో చేరిక.. అక్కడ ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ గెలుపులో ఎలా కీలక పాత్ర పోషించాడనే అంశాలపై సీన్లు ఉంటాయని సమాచారం. కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అభిమానుల శ్రీనన్నగా ఎలా మారాడు?, ఆయన చేస్తున్న సహాయక కార్యక్రమాలపై సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం పొంగులేటి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఈ చిత్రంపై తీవ్ర చర్చ సాగుతోంది. జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ తదితర నాయకులకు సంబంధించిన సీన్లు ఈ సినిమాలో ఉంటాయా? ఆ పాత్రలను ఎవరు పోషిస్తారు? అన్న ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలైన తర్వాతనే ఈ ప్రశ్నలకు సమాధానం లభించే ఛాన్స్ ఉంది.