Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఊహించని ట్విస్ట్.. ఆ మహిళా నేతకే ఛాన్స్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణతో పాటు నందమూరి సుహాసిని, జయసుధ, బండారు విజయలక్ష్మి కూడా టికెట్ రేసులో ఉన్నారు.

New Update
Jjubilee hills

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రానే వచ్చింది. నవంబర్ 11న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13న ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు సమానంగా 8 ఎంపీ సీట్లలో విజయం సాధించడంతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపొందిన బీజేపీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ఫలితం వచ్చినా.. పార్లమెంట్ కు తప్పా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బలం చాటలేదన్న విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండే నియోజకవర్గం కావడంతో ఆయనకు కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. 

రాంచందర్ రావుకు తొలి పరీక్ష..

రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాంచందర్ రావుకు కూడా ఈ ఎన్నిక మొదటిదే. దీంతో ఈ ఎలక్షన్ ఆయనకు తొలి పరీక్ష అన్న చర్చ కూడా ఉంది.  ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారం కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించకపోయినా.. ఆశావహులతో పాటు, మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అలర్ట్ అయ్యింది. రేపు ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఉప ఎన్నికల అభ్యర్థిని ఈ సమావేశంలోనే ఫైనల్ చేయనున్నారు. 

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ టికెట్ రేసులో ముందు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నందమూరి సుహాసిని, సినీనటి జయసుధ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.  ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై ముగ్గురి తో బీజేపీ కమిటీ వేసింది. రేపు ఆ కమిటీ అభిప్రాయ సేకరణ చేయనుంది. డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించనుంది.

అనంతరం బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ పేర్లపై చర్చించి.. కేంద్ర పార్టీకి పేర్లను పంపించనున్నారు. దీంతో ఎల్లుండి సాయంత్రంలోగా అభ్యర్థి పేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వడంతో.. బీజేపీ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలన్నది ఆ పార్టీ వ్యూహమని సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. 

Advertisment
తాజా కథనాలు