/rtv/media/media_files/2025/07/17/kavitha-2025-07-17-11-12-26.jpg)
Telangana Jagruthi kavitha
Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ భవనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె నార్సింగ్ లో ఆందోళనకు దిగారు. మూసీనది ఒడ్డున బడా బాబులు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నా అధికారులు చూసీ చూడనట్టూ వ్యవహరిస్తున్నారని, పేదవారి ఇండ్లను మాత్రం హైడ్రా పేరుతో కూలుస్తున్నారని ఆమె ఆరోపించారు. బడా బాబుల ఇండ్లు కూల్చేందుకు హైడ్రా బుల్డోజర్లు వెంటనే రావాలని వారు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ కవిత స్థానికులతో కలిసి బైఠాయించారు. దీంతో ఆమె తో పాటు జాగృతి నాయలకును అరెస్ట్ చేసి.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలప్రయోగంతో తనను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల ఇండ్లను కూలగొడుతున్నారంటూ ఆమె ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇస్తే కాంగ్రెస్ దానినే కొనసాగిస్తోందని కవిత విమర్శించారు.ప్రభుత్వాలు పెద్దల పక్షాన్నే ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఆరోపించారు.
మూసీ రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన కవిత.. వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేయడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చుతున్నందుకు ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. హైడ్రా బుల్డోజర్లు ఇక్కడికి వచ్చి వీటిని కూలిస్తేనే.. రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే.. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని తాము భావిస్తామని కవిత అన్నారు. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలంటున్న ప్రభుత్వం పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు.
Follow Us