పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది తెస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నంబర్-2 గా పెత్తనం చేస్తున్నాడని తెలిపారు. పొంగులేటిని కంట్రోల్ చేయాలని కోరారు.

New Update
Ponguleti Srinivas Reddy Telangana Congress

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీనియర్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. పొంగులేటి అన్ని విషయాల్లో కలగజేసుకుని పార్టీకి ఇబ్బందిగా మారాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బంది తప్పదని వారు హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల దీపావళికి ముందు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ పొంగులేటి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎవరైనా అరెస్ట్ కావొచ్చంటూ హింట్ ఇచ్చారు. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఏం జరగబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. దీపావళి ముగిసినా అలాంటిదేమీ జరగలేదు. అయితే.. ఇది పొంగులేటి సొంత కామెంట్స్ అని పార్టీకి సంబంధమే లేదన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. పార్టీ, ప్రభుత్వంలో ఎలాంటి చర్చ చేయకుండా ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంకా ప్రభుత్వంలోనూ తాను నంబర్.2 అనేలా పొంగులేటి వ్యవహరిస్తున్నాడని సీనియర్ నేతలు పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టులన్నీ ఆయన సొంత కంపెనీకే వెళ్లడం సరికాదన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: సచివాలయంలో బెటాలియన్ పోలీసులు ఔట్.. బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్

ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి..

2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి.. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆయనకు పార్లమెంట్ టికెట్ దక్కలేదు. తర్వాత రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారన్న చర్చ జరిగినా.. ఆ ఛాన్స్ కూడా దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

2023 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కొందరు అనుచరులకు సైతం టికెట్లు ఇప్పించుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పొంగులేటికి మంత్రి పదవి దక్కింది. ముఖ్యమైన రెవెన్యూ శాఖ దక్కడంతో ఆయన ప్రభుత్వంలో కీలకంగా మారారు. వీహెచ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి పోటీ పడ్డా కూడా తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు. 

ఖమ్మం కాంగ్రెస్ లోనూ కుమ్ములాటలు..

రేవంత్ కేబినెట్లో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. ఇందులో భట్టి విక్రమార్క మినహా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. వీరిలో పొంగులేటి ఆధిపత్యం ఎక్కువగా ఉండడంపై భట్టి వర్గీయులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొంగులేటి పెత్తనం తమకు ఇబ్బందిగా మారిందని నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పొంగులేటిని కంట్రోల్ చేయడానికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు