/rtv/media/media_files/2025/10/31/komatireddy-rajagopal-reddy-1-2025-10-31-17-17-59.jpg)
తెలంగాణ కాంగ్రెస్ లో గత రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం రేవంత్.. మరో రెండు ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆశావహులను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కేబినెట్లో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్న ఇద్దరు కీలక నేతలకు కేబినెట్ ర్యాంక్ హోదాతో నామినేటెడ్ పోస్టులు కేటాయించారు రేవంత్. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం సలహాదారు పదవితో పాటు ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కీలకపైమన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించారు. దీంతో వీరిద్దరినీ విజయవంతంగా మంత్రి పదవి రేసు నుంచి తప్పించారు రేవంత్.
మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. గత విస్తరణలో చోటు దక్కకపోవడంతో వీరంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఏకంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగి వీరితో చర్చలు జరిపి బుజ్జగించారు. కేబినెట్ ర్యాంకు పదవులు దక్కడంతో ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి రేసు నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. ఇంకా మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రేసులో ఉన్నారు. అయితే.. హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ కు చోటు దక్కడంతో మల్ రెడ్డికి ఛాన్స్ దక్కడం కష్టమన్న చర్చ సాగుతోంది. ఆయనకు కూడా సమయం చూసి కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్న నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలోనే కోమటిరెడ్డికి హామీ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఎన్నికలకు ముందే హామీ ఇచ్చి ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో పాటు.. ఎంపీ ఎన్నికల సమయంలోనూ ఆయనకు పదవి ఆశపెట్టిన విషయాన్ని హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వొద్దన్న రూల్ ను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో సడలించాలని భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లోపే రాజగోపాల్ రెడ్డి మంత్రి అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Follow Us