పదవుల పంపకాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను గుర్తించి వారికి పదవులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడ్డ మధుయాష్కీ గౌడ్‌కు జాతీయ జనరల్ సెక్రెటరీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం డిసైడ్ అయినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ముఖ్య సీనియర్ నేత వీహెచ్‌కు కూడా కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఏఐసీసీ ఓబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ ఇద్దరికి పదవులు ఇవ్వడం ద్వారా అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోందన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే యోచనలో కాంగ్రెస్ ఉంది.
దసరా తర్వాత కేబినెట్ విస్తరణ..
మరో వైపు కేబినెట్ విస్తరణకు సైతం హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దసరా తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఈ లోగా ఇతర నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ముదిరాజ్ సమాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఖాయమన్న చర్చ పార్టీలో జరుగుతోంది. చెన్నూరు నుంచి విజయం సాధించిన వివేక్ వెంకటస్వామికి సైతం మంత్రి పదవి దక్కడం పక్కా అని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.