/rtv/media/media_files/HnJcJ8GZZNebjY8aCZ97.jpg)
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా IPSల బదిలీలు చేసింది. ఇందులో భాగంగా IPS సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్‌గా నియమించింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సజ్జనార్‌కు అంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న ఆయన కొన్నాళ్ల పాటు ఖాకీ చొక్కా వదిలి ఆర్టీసీ ఎండీగా కూడా పని చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ బాస్ గా మరోసారి లాఠీ పట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రాక్ రికార్డ్ పై స్పెషల్ స్టోరీ..
IPS సజ్జనార్.. ఈ పేరు వింటే నేరస్తులు, రేపిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. సంచలనం సృష్టించిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ యువతులపై యాసిడ్ దాడి, హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశా రేప్.. ఈ రెండు కేసుల్లో ఆయన హాయంలో ఏడుగురు నేరస్తులు ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను TSRTC ఎండీగా నియమించింది. అక్కడ కూడా తనదైన మార్క్ చూపిన సజ్జనార్.. నాలుగేళ్ల తర్వాత ఆయన మళ్లీ యూనిఫాం వేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రభుత్వం సజ్జనార్‌కు మళ్లీ లాఠీ చేతికిచ్చిందన్న చర్చ సాగుతోంది.
వరంగల్ ఎన్‌కౌంటర్
2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితులను సజ్జనార్ ఎన్‌కౌంటర్‌లో లేపేశారు. ఆ టైంలో ఆయనపై పెద్ద ఎత్తున ప్రసంశలు వచ్చాయి. నిందితులు క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేశారు. పోలీసుల ఆత్మరక్షణలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనతో 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' అనే ట్యాగ్ సజ్జనార్‌కు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన పని సామాన్య ప్రజలు మెచ్చకున్నారు.
దిశ కేసు
2018 మార్చిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సజ్జనార్ క్రైమ్ రేట్ తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, పిల్లల సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ఫోకస్ చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు తీసుకువచ్చారు. 2019, నవంబర్​ 27న జరిగిన వెటర్నటీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు షాద్​నగర్​ ORR టోల్‌గేట్‌కు సమీపంలో దిశాను అత్యాచారం చేసి, హత్య చేశారు. మృతదేహాన్ని షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్పాట్‌లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా ఈ కేసు సజ్జనార్ వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో నిందితులను ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితులను తీసుకువెళ్తున్న వాహనంపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసుతో తెలంగాణ సమాజం మొత్తం అట్టుడికిపోయింది.
2019 డిసెంబర్​ 6న తెల్లవారుజామున పోలీసులు సీన్ రీక్రియేషన్‌కు తీసుకెళ్లారు. తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తమ వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించగా, నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సీపీ సజ్జనార్‌పై ప్రసంశలు వెల్లువెత్తాయి. ఆ ఎన్‌కౌంటర్‌ని చాలా మంది సపోర్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని హ్యూమన్ రైట్స్ గ్రూపులు విమర్శించాయి. పలు మానవ హక్కుల సంఘాలు, ఎన్జీవోలు బూటకపు ఎన్‌కౌంటర్ అని కోర్టును ఆశ్రయించాయి.
సిర్కూర్కర్ కమిషన్
ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది. దిశా నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో క్షేత్రస్తాయిలో సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ వీఎస్ సిర్కూర్కర్, జస్టిస్ పీఎస్బీ రేఖ, డాక్టర్ డీఆర్ కార్తికేయన్​తో కూడిన కమిషన్, సుప్రీంకోర్టుకు సమర్పించిన 387 పేజీల నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. దిశా నిందితుల ఎన్​కౌంటర్ బూటకమని తమ నివేదికలో స్పష్టం చేసింది. 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారణ జరపాలని సిఫార్సు చేసింది. మృతుల్లో ముగ్గురూ మైనర్లేనని కమిషన్ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు 2021లో సజ్జనార్ విచారణకు హాజరయ్యారు. తర్వాత ఆయన్ని రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఆ టైంలో ఆయకు అది పనిష్‌మెంట్ అని చాలామంది అనుకున్నారు.
ఆర్టీసీలో అనేక సంస్కరణలు
ఫ్యామిలీ లైఫ్
సజ్జనర్ పూర్తి పేరు విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్. 1968 అక్టోబర్ 24న కర్ణాటకలోని హుబ్బళ్ళిలో జన్మించారు. లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ప్రాథమిక విద్య, జె.జి. కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బి.కామ్, కౌసలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1996లో సివిల్స్ పరీక్షలో విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో IPSగా చేరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడే కొనసాగారు. ఆయనకు భార్య అనుప సజ్జనార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజ్జనార్ కెరీర్ మొదట్లో జనగామ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ప్రారంభించారు. తర్వాత వివిధ పదవుల్లో కీలక పాత్రలు పోషించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ), స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా మావోయిస్ట్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు.