KTR-Harish: కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

New Update

కేటీఆర్ కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే కార్యకర్తను తాను అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాను అనేక సార్లు చెప్పానన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో హరీష్‌ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే.. రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడని ఫైర్ అయ్యారు. ధాన్యపు రాశుల చుట్టూ తిరగాల్సిన వారు అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

రైతుల మరణాలకు రేవంత్ దే బాధ్యత..

దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం దురదృష్టకరమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో రోజుల తరబడి ఎండలో ఉంటూ పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతుల మరణాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలకు రాహుల్ గాంధీ సాక్ష్యమన్నారు. 

రాహుల్ గాంధీ వరంగల్లో రైతులకు ఇచ్చిన హామీలపై ఏమని సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ముఖ్యమంత్రిని అడిగితే అప్పులు పుట్టడం లేదని అంటున్నాడన్నారు. చివరికి పాకిస్తాన్ ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. 

(telugu-news | latest-telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు