/rtv/media/media_files/2025/08/09/brs-party-2025-08-09-09-21-03.jpg)
ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీలపై ఫోకస్ పెట్టింది. తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై అధికార పార్టీలో చేరిన వారిని అనర్హులుగా గుర్తించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసేందుకు పార్టీ లీగల్ సెల్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.
కాంగ్రెస్‌లో చేరిన వారిలో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, దండె విఠల్, ఎం.ఎస్. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ ఉన్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు స్పష్టం చేసింది. దీంతో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్సీలపై వేటు తప్పదని.. వారి స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ చెబుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార హస్తం పార్టీ లో చేరిపోయారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కడియ శ్రీహరి కూడా హస్తం గూటికి చేరిపోయారు.
ఆయన కూతురును వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించి గెలిపించుకున్నారు. వీరితో పాటు పటన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్సే పోచారం శ్రీనివాసరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు వీరందనిపై అనర్హత వేటు వేయించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది.
బనకచర్లపై సైతం న్యాయ పోరాటం..
మరో వైపు బనకచర్ల అంశంపై సైతం న్యాయం పోరాటం ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో బనకచర్లను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.