బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనదే తన లక్ష్యం అన్నారు. ఈ రోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్..
అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం..
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను పక్కకు పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది.